జిల్లాలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీసు సిబ్బంది పనిచేయాలి
ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా పకడ్బంది ప్రణాళికతో పోలీసు విధులు
ఎన్నికల విధులు, విధివిధానాలపై పోలీస్ సిబ్బందికి అవగాహన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంతో కూడిన నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న పోలీస్ సిబ్బంది యెుక్క ఎన్నికల విధులు, విధివిధానాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై ఖమ్మం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో కిసాన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణకు లోబడి పనిచేయాలన్నారు. ఎన్నికల నియమావళిపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని, ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు. అప్పగించిన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో డబ్బు,మద్యం ప్రభావాన్ని నిలువరించేందుకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోందని గ్రహించాలన్నారు. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లైయింగ్ స్క్వార్జ్ టీమ్స్, సరిహద్దు చెక్ పోస్టులు,రూట్ మొబైల్ పార్టీలు, ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు సందర్భంగా నిర్వహించే విధులలో పూర్తి అవగాహన వుండాలన్నారు. అదేవిధంగా ఎన్నికల సభలు, సమావేశాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకొవాలని సూచించారు. గ్రామాల్లో ఘర్షణ వాతావరణం లేకుండా పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరంగా చేయాలని, బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలను నియత్రించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా &అర్డర్ ప్రసాద్ రావు, ఏసీపీ తిరుపతి రెడ్డి, సిఐలు రాజు, మురళి, రూరల్ డివిజన్ ఎస్సైలు పాల్గొన్నారు.



