కవులు సమాజ సంపదతో సమానం
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు
జిల్లా గ్రంథాలయాభివృద్ధికి కృషి
కాకతీయ,కొత్తగూడెం రూరల్ : కవులు, కళాకారులు ఈ సమాజ సంపదతో సమానమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆవరణలో చైర్మన్ పసుపులేటి వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓ కవి కలం నుంచి జాలువారే ప్రతీ సిరా చుక్క వేయి మెదళ్లను కదలించగలిగే శక్తిగా ఉండాలని అన్నారు. బడబాగ్నిని రగిలించే అక్షరానికి అంతటి మహత్తర శక్తి ఉంటుందని చెప్పారు. ఉపాధ్యాయులు కూడా కవులుగా ఉండటం ఎంతో అదృష్టమని, మీరు రాసే కవితలు, రచనలు రాబోయే రోజుల్లో చక్కటి ప్రాచుర్యాన్ని పొందాలని ఆకాంక్షించారు. తనకు పుస్తక పఠనం అంటే ఎంతో ఇష్టమని, అనేక మంది కవులు, రచయితలు రాసిన పుస్తకాలను చదివినట్లు చెప్పారు. విద్యార్థులు పుస్తక పఠనం పై మక్కువ పెంచుకోవాలని, పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు పుస్తకాలతో దోస్తే చేస్తే మేలు జరుగుతుందని చెప్పారు. ఇంత ఘనంగా గ్రంధాలయవారోత్సవాలు నిర్వహించడం అభినందనీయం అని, గ్రంధాలయానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి గ్రంథాలయాభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం కవులను సన్మానించారు. ముందుగా పలు పాఠశాలలకు చెందిన విద్యార్ధినీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, సీపీఐ పార్టీ కార్యదర్శి సాబీర్ పాష, గ్రంథాలయ కార్యదర్శి కరుణకుమారి, ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగి అసోసియేట్ అధ్యక్షురాలు కె అంబిక, గ్రంథపాలకురాలు గుమ్మడి మణిమృదుల, మధుబాబు, వాణి, సిబ్బంది, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.


