ప్రైవేట్‌కు దీటుగా పీఎం శ్రీ పాఠశాలలు
తల్లిదండ్రులు గర్వంగా పిల్లలను పంపే స్థాయి అభివృద్ధి లక్ష్యం
28 పాఠశాలల అభివృద్ధికి కోట్ల నిధులతో ప్రత్యేక కార్యాచరణ
విద్యార్థుల నమోదు పెంపు, మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి
కేంద్ర బయో టెక్నాలజీ శాఖ జాయింట్ సెక్రటరీ ఏక్తా విష్నోయి
విద్యార్థుల పఠన సామర్థ్యాల పెంపుపై జిల్లా పనితీరుకు ప్రశంసలు
కాకతీయ, ఖమ్మం : ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉండాలంటే పీఎం శ్రీ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కేంద్ర బయో టెక్నాలజీ శాఖ జాయింట్ సెక్రటరీ ఏక్తా విష్నోయి స్పష్టం చేశారు. తల్లిదండ్రులు నమ్మకంతో, గర్వంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపే వాతావరణం కల్పించడమే పీఎం శ్రీ పథకం అసలు లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో పీఎం శ్రీ పాఠశాలల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి విద్యాశాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. పిల్లల పఠన నైపుణ్యాల పెంపుకు ఖమ్మం జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శప్రాయమని ఆమె కొనియాడారు. ముఖ్యంగా “ఎవ్రీ చైల్డ్ రీడ్స్” కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో చదివే అలవాటు పెంపొందించడంలో అధికారులు చూపిన చొరవ ప్రశంసనీయమని పేర్కొన్నారు. పాఠశాలల్లో హాజరు నమోదుకు అమలు చేస్తున్న ఫేషియల్ రికగ్నిషన్ విధానం పారదర్శకతకు నిదర్శనమని అన్నారు.
నమోదు పెంపే అసలు సవాలు
జిల్లాలో ఎంపిక చేసిన పీఎం శ్రీ పాఠశాలల్లో కొన్నిచోట్ల విద్యార్థుల సంఖ్య తగ్గడం ఆందోళన కలిగించే అంశమని కేంద్ర జాయింట్ సెక్రటరీ తెలిపారు. ఈ సమస్యను సీరియస్‌గా తీసుకుని నమోదు పెంపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంపు కీలకమని అన్నారు. ప్రతి పాఠశాలను మౌలిక వసతులు, బోధన, సాంకేతిక సదుపాయాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దితేనే తల్లిదండ్రుల ఆకర్షణ పెరుగుతుందని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ పీఎం శ్రీ పథకం కింద జిల్లాలో 28 పాఠశాలలను ఎంపిక చేసి సమగ్ర అభివృద్ధి చర్యలు చేపట్టామని తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి కేటాయించిన రూ.1.15 కోట్లలో ఇప్పటికే రూ.1.07 కోట్లు వినియోగించి మౌలిక వసతులు మెరుగుపరిచామని వివరించారు. “బడి బాట” కార్యక్రమంతో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందని, సుమారు మూడు వేల మంది కొత్తగా చేరారని వెల్లడించారు.
సమగ్ర అభివృద్ధితో కొత్త దిశ
పాఠశాలల్లో స్కౌట్, గైడ్ కార్యక్రమాలు, క్రీడా సామాగ్రి, ప్రత్యేక తరగతులు, పరిశ్రమల సందర్శనలు నిర్వహిస్తూ విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గర్ల్ చైల్డ్ ఎంపవర్‌మెంట్ క్లబ్‌ల ద్వారా బాలికలకు నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల ఖాళీలు లేకుండా చర్యలు తీసుకున్నామని, సాంకేతిక ఆధారిత బోధనకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో పీఎం శ్రీ పాఠశాలలు 95 శాతం ఉత్తీర్ణత సాధించడం ప్రభుత్వ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు. ఈసారి వంద శాతం ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న సమగ్ర చర్యలు, కేంద్రం చూపుతున్న ప్రత్యేక దృష్టితో పీఎం శ్రీ పాఠశాలలు ప్రభుత్వ విద్యకు కొత్త గుర్తింపు తీసుకురావడమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని విద్యావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


