కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-III ఒక ప్రత్యేక బహుమతిని పంపించారు. ఆయన పంపిన గిఫ్ట్ మరేదీ కాదు… కదంబ చెట్టు. ఈ బహుమతిని బుధవారం న్యూఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ అధికారికంగా ప్రధానికి అందజేసింది. అనంతరం ప్రధాని మోదీ తన అధికారిక నివాసమైన 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఈ చెట్టును శుక్రవారం ఉదయం స్వయంగా నాటారు. ఆ తర్వాత మొక్కకు నీళ్లు పోసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత 17వ తేదీన ప్రధాని మోదీ తన 75వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు అనేక దేశాధినేతలు మరియు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక రోజునే కింగ్ చార్లెస్-III నుంచి కదంబ చెట్టు రూపంలో వచ్చిన బహుమతి మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రధాని మోదీ “అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి” అనే పిలుపుని గతంలో ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆలోచనకే అనుగుణంగా కదంబ చెట్టును గిఫ్ట్‌గా పంపడం ద్వారా బ్రిటన్ రాజు తన అభిమానం వ్యక్తం చేసినట్లు భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై మోదీ చేస్తున్న అవగాహన ప్రయత్నాలకు ఇది ఒక ప్రతీకగా నిలుస్తోంది.


