ఆసుపత్రి ఆవరణలో వ్యర్థాల గుట్టలు!
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. దుర్వాసనతో సతమతం
రోగులు, సందర్శకులకు ఇబ్బందులు
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి పరిశుభ్రతకు నిలయంగా ఉండాల్సిన స్థితి నుంచి పూర్తిగా విరుద్ధంగా అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. ఆసుపత్రి ఆవరణలో వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లోనే పడేయడంతో రోగులు, సందర్శకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఆవులు, పందులు, కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతూ వ్యర్థాలను చెదరగొడుతున్నాయని, దీంతో దుర్వాసన వ్యాపించి పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆరోపిస్తున్నారు. ఉన్న రోగాన్ని నయం చేసుకోవడానికి ఆసుపత్రికి వస్తే, అపరిశుభ్ర వాతావరణం కారణంగా కొత్త రోగాలు అంటుకునే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. శుభ్రతకు ప్రతీకగా ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారడం బాధాకరమని విమర్శిస్తున్నారు.
పర్యవేక్షణ లేకపోవడమే కారణం
ఆసుపత్రి నిర్వహణపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రోజూ వేలాది మంది రోగులు వచ్చే ఆసుపత్రిలో కనీస పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించకపోవడం దురదృష్టకరమని అంటున్నారు. ఈ విషయంపై తెలంగాణ ఎస్సీ–ఎస్టీ–బీసీ–మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ స్పందించారు. ఆసుపత్రి మొత్తం అపరిశుభ్రంగా మారి జంతువులకు నిలయంగా మారిందని, హానికరమైన ఆసుపత్రి వ్యర్థాలను ఆవరణలోనే కుప్పలుగా వేయడం అత్యంత ప్రమాదకరమని అన్నారు.
సూపరింటెండెంట్ స్పందించాలి
ఆసుపత్రి వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్యంపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించి ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొనేలా చూడాలని కోరారు.


