- పోలీస్ కమిషనర్ సునీల్ దత్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని, యువకులు రీల్, సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు, స్ధానిక పోలీసులకు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్ 8712659111, కలెక్టర్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ 1077, సెల్ నెంబరు 9063211298 సమాచారం ఆందిచాలని సూచించారు.
కామేపల్లి మండలం పొన్నెకల్ వద్ద బుగ్గవాగు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పొన్నెకల్ – కొత్తలింగాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. రఘునాధ పాలెం మండలంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పాపటపల్లి నుండి విఆర్ బంజర మధ్యలో ఉన్న బుగ్గవాగులో బ్రిడ్జి పై నుండి మూడు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపి వేశారన్నారు. కారేపల్లి మండలం కమలాపురం నుండి కొత్తలింగాల వెళ్లే రోడ్ పై నుండి బుగ్గవాగు మూడు అడుగుల మేర, తోడితలగూడెం నుండి చీమలపాడు వెళ్లే మార్గంలోని వంతెన పై నుండి రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో తాత్కాలికంగా వాహనాల రాకపోకలు ఆయన నిలిపివేశారని తెలిపారు.


