రేవంత్ పాలనలో ప్రజలకు మనశ్శాంతి లేదు
అభివృద్ధే బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తుంది
కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలి
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
కాకతీయ, చేర్యాల : కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి పనులే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని, ఈ ఎన్నికల్లో ఓటుతో గట్టి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం చేర్యాలలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే పల్లా, కారు గుర్తుకు ఓటేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే 3వ వార్డులో బీఆర్‌ఎస్ మద్దతిచ్చిన సీపీఎం అభ్యర్థి ముస్త్యాల లావణ్యను సుత్తికోడవలి గుర్తుపై గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రెండేళ్ల రేవంత్ సర్కార్లో ప్రజలెవరూ ప్రశాంతంగా లేరని, ఆచరణకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం 420 ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో షాదీముబారక్, రంజాన్ తోఫా, కమ్యూనిటీ హాళ్లు వంటి పథకాలు అమలయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుతం రోడ్లు అధ్వానంగా మారడం, కరెంటు కోతలు, చెత్త సమస్యలు పెరగడం అభివృద్ధి కాదని ప్రశ్నించారు. మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరితేనే చేర్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.


