ట్విట్టర్ టిల్లు మాటలతో ప్రజలు మోసపోరు
కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్‌రెడ్డి ఘాటు కౌంటర్
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపు
కాకతీయ, భువనగిరి : సోషల్ మీడియాలో చిల్లర వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి భాషపై విమర్శలు చేసే అర్హత కేటీఆర్‌కు లేదని, బూతు మాటలకు నిజమైన రాజులు బీఆర్ఎస్ నేతలేనని ఎద్దేవా చేశారు. “కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్)లో చిల్లర మాటలు రాస్తున్నారు. బూతు అనే పదానికి నాయకుడు ఎవరు అని గూగుల్‌లో వెతికితే మీ నాయన కేసీఆర్ పేరే ముందుగా వస్తుంది” అని ఎంపీ ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో కేసీఆర్ వాడిన భాష ఎలా ఉందో ఒకసారి యూట్యూబ్‌లో చూసుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాష మనుషులను బట్టి ఉంటుందని, ప్రజలకు అర్థమయ్యే రీతిలోనే ఆయన విషయాలను వివరిస్తున్నారని ఎంపీ అన్నారు. “మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో, అప్పుల పాలు చేశారో ప్రజలకు పూర్తిగా అర్థమైంది. అందుకే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు చెంప మీద కొట్టారు” అని ధ్వజమెత్తారు.
వరుస ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారు
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా ఇచ్చారని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని ఎంపీ గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను ప్రజలు చిత్తు చేశారని అన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడటంతో కేటీఆర్ మళ్లీ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండేళ్లలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం “ఇంటికో ఉద్యోగం” అని చెప్పి తమ ఇంట్లోనే ఐదుగురికి ఐదు ఉద్యోగాలు ఇచ్చుకుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం అసలు తత్వం తెలంగాణ ప్రజలు గుర్తించాలని సూచించారు. రాబోయే వారం రోజుల్లో బీఆర్ఎస్ నేతలు గల్లీల్లో తిరుగుతూ చిల్లర ప్రచారం చేస్తారని, ప్రజలు వారి మాటలను పట్టించుకోవద్దని ఎంపీ కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌పై నమ్మకం ఉంచి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాల్సిన అవసరం ఉందని ఎంపీ స్పష్టం చేశారు. “ట్విట్టర్ టిల్లులు పోస్టులు పెట్టినంత మాత్రాన ఏమీ ఒరిగేది లేదు. చివరకు తీర్పు చెప్పేది ప్రజలే” అని చామల కిరణ్‌రెడ్డి తేల్చిచెప్పారు.


