జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం
గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు.. త్వరలో నూతన కమిటీలు
టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య
కాకతీయ, ఖమ్మం : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు సాధించేవరకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నిరంతరం పోరాడుతుందని ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య స్పష్టం చేశారు. సోమవారం ఖమ్మంలోని కోణార్క్ హోటల్‌లో సంతోష్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని తెలిపారు. టీడబ్ల్యూజేఎఫ్‌పై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మామిడి సోమయ్య తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులను అయోమయానికి గురి చేసేందుకు, సంఘం తమదే అన్నట్లుగా కొందరు మాజీ నాయకులు చేస్తున్న ప్రచారాలను జర్నలిస్టులు నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఫెడరేషన్‌లోని వ్యవస్థాపక సభ్యులు అన్ని జిల్లాలు తిరుగుతూ సంఘం బలోపేతానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కూడా సంఘాన్ని బలోపేతం చేయడానికి త్వరలో జిల్లా మహాసభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న
ప్పటికీ జర్నలిస్టుల ప్రధాన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి టీడబ్ల్యూజేఎఫ్ సిద్ధమవుతుందని హెచ్చరించారు. జర్నలిస్టుల పక్షాన నిలబడి సమస్యలపై నిరంతరం పోరాటం చేసే ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఐఎఫ్‌డబ్ల్యుజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఐఎఫ్‌డబ్ల్యుజే నిరంతరం పోరాడుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాకు అడ్‌హాక్ కమిటీని ప్రకటించారు. ఖమ్మం జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ కన్వీనర్‌గా టీ. సంతోష్ చక్రవర్తి, కో-కన్వీనర్లుగా అర్వపల్లి నగేష్, అంతోటి శ్రీనివాస్, నానబాల రామకృష్ణ, వందనపు సామ్రాట్‌లను రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు చేసినట్లు, త్వరలో కొత్త రాష్ట్ర కమిటీతో పాటు అన్ని జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం సత్తుపల్లి కి చెందిన సీనియర్ రిపోర్టర్ దమ్మాలపాటి సత్యనారాయణ మృతికి సంతాపం ప్రకటించారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కో-కన్వీనర్లు వల్లాల జగన్, జి. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పి. గోపాల్, సూర్యపేట కమిటీ బాధ్యులు పాల్వాయి జానయ్య, సీనియర్ జర్నలిస్టులు రఘురాం, సాదిక్ పాషా, న్యాయ సలహాదారులు పసుపులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


