కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలంలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గత పది రోజులుగా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. సహనం కోల్పోయిన రేగళ్లపాడుతండా (పెద్దతండ) మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు.
గత పది రోజులుగా అటు కిన్నెరసాన్ని నీళ్లు కానీ ఇటు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఇదే విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడ సమస్యను పరిష్కరించకపోవడంతో ఇలా మండుటెండలో నీటి కోసం నిరసన చేస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
తండా వాసులైన తమకు శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఎప్పటికప్పుడు శుద్ధమైన నీరు అందేలా చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. పంచాయతీ, మండల అధికారులు ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు పరిష్కారం చూపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.


