యంగ్ ఇండియా స్కూల్ భూ బాధితులకు భరోసా కల్పించిన అధికారులు.
గోపాలరావుపేట క్రీడా ప్రాంగణం శాశ్వతంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం.
తాసిల్దార్ గొంది గోపాలకృష్ణ.
కాకతీయ, పినపాక: పినపాక మండలంలోని తోగూడం పంచాయతీ గోపాలరావుపేట గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం సేకరించిన భూములపై శనివారం గ్రామసభ నిర్వహించారు. తహసిల్దార్ జి. గోపాలకృష్ణ, ఎంపీడీవో, స్పెషల్ ఆఫీసర్ సంకీర్త్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ, సర్వే నెంబర్ 128లో 25 ఎకరాలు, సర్వే నెంబర్ 512/1లో 5 ఎకరాలు, మొత్తం 30 ఎకరాల భూమిని సేకరించినట్లు తెలిపారు.భూ బాధితులు అధైర్యపడవద్దని, ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో అర్హతల ఆధారంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే, ప్రభుత్వ పథకాలలో భాగంగా గొర్రెలు, కౌజు పిట్టలు, మేకలు, గేదెలు, కోళ్ల పెంపకానికి సంబంధించిన స్కీముల్లో భూ బాధితులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తాసిల్దార్ గొంది గోపాలకృష్ణ మాట్లాడుతూ గోపాలరావుపేటలోని క్రికెట్ గ్రౌండ్ కేవలం క్రీడా ప్రాంగణంగానే కాకుండా, పరిసర గ్రామాల రైతులకు దాన్యం కొనుగోలు కేంద్రంగా కూడా ఉపయోగపడుతోందని, ఈ క్రీడా మైదానాన్ని శాశ్వతంగా ఉంచే దిశగా కలెక్టర్ కి ప్రతిపాదన పంపనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ వెంకటేశ్వర్లు సెక్రటరీ సంధ్యారాణి, గ్రామస్తులు, భూ బాధితులు పాల్గొన్నారు.



