ప్రజావాణి కి అధికారుల డుమ్మా
* 11 దాటినా జాడలేని అధికారులు
* 29 శాఖలకు గాను ఐదుగురే హాజరు
* ఖాళీ కుర్చీలతో వేదిక
కాకతీయ, కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల స్థాయి అధికారుల తీరు ప్రజావాణి ఉద్దేశాన్నే ప్రశ్నార్థకం చేస్తోందన్న విమర్శలు మండలవ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

సోమవారం ఉదయం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి 29 శాఖలకు చెందిన అధికారులు హాజరు కావాల్సి ఉండగా, ఉదయం 11.30 గంటలు దాటినా కేవలం ఐదు శాఖల అధికారులు మాత్రమే పాల్గొన్నారు. మిగిలిన శాఖల అధికారుల గైర్హాజరుతో ప్రజావాణి వేదికపై ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.
సమస్యలు వినేందుకు కాదు… సంతకాల కోసమేనా?
ప్రజావాణి ప్రారంభ సమయానికి అధికారులు రాకపోవడంతో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు అధికారులు ఆలస్యంగా వచ్చి కేవలం హాజరు సంతకాలు పెట్టుకుని వెళ్లిపోవడం ప్రజావాణి అసలు ఉద్దేశాన్నే ప్రశ్నార్థకం చేస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. సమస్యలు వినేందుకు కాదు… అధికారుల సంతకాల కోసమే ప్రజావాణి అన్నట్లుగా వ్యవహారం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండల స్థాయిలో సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణికి దరఖాస్తులు చేసుకునేందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మండల ప్రజావాణి పేరుకే పరిమితమై, అసలు లక్ష్యం నెరవేరడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారుల నిర్లక్ష్యం నీరుగారుస్తోందని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రజావాణికి గైర్హాజరైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.


