అవామీ లీగ్‌పై అధికారిక నిషేధం
బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలన మలుపు
ఎన్నికల బరిలోకి దిగకుండా తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయం
మరింత వేడెక్కిన బంగ్లాదేశ్ రాజకీయం
2026 ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు
కాకతీయ, నేషనల్ డెస్క్ : బంగ్లాదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దశాబ్దాలుగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అవామీ లీగ్, రాబోయే సాధారణ ఎన్నికలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల సంఘం అవామీ లీగ్ పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడంతో, 2026లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. 1971 తర్వాత అవామీ లీగ్ ఎన్నికలకు దూరమవడం ఇదే తొలిసారి కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన హింసాత్మక ఘటనలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద అవామీ లీగ్ కార్యకలాపాలపై నిషేధం విధించినట్లు తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది.
షేక్ హసీనా ఘాటు స్పందన
ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా, అవామీ లీగ్ లేకుండా జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ఇవి ఎన్నికలు కాకుండా కేవలం “పట్టాభిషేకం” లాంటివేనని వ్యాఖ్యానించారు. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దేశంలో సంస్కరణలు చేపడుతూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో బంగ్లాదేశ్ రాజకీయ భవితవ్యం ఏ దిశగా మలుపు తిరుగుతుందన్నది అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.


