అధికారి గుప్పిట అటవీశాఖ
భద్రాద్రి సర్కిల్లో సొంత రాజ్యం
అవినీతి, అక్రమార్కులకు ఉన్నతాధికారి అభయహస్తం
కీలక స్థానంలో నాలుగేళ్లుగా తిష్ట.. నెలవారీగా భారీగా వసూళ్ల పర్వం
ఏపనైనా.. లక్షలే లక్ష్యం.. క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఉండాలన్న ఇవ్వాల్సిదేనంట
ఖమ్మం ఎఫ్ ఆర్వో సస్పెన్షన్‌ను అడ్డుకునేందుకు ఉన్నతాధికారి విఫలయత్నం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : భద్రాద్రి సర్కిల్ అటవీ శాఖలో ఓ ఉన్నతాధికారి పనితీరు..వసూళ్ల వ్యవహారంపై ఇప్పుడు జోరుగా విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమాలకు పాల్పడే ఉద్యోగులు, అధికారులను కాపాడటమేకాకుండా.. అక్రమాల్లోనూ గట్టిగానే అమ్యామ్యాలకు అలావాటు పడినట్లుగా డిపార్ట్మెంట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. సదరు అధికారి నాలుగేళ్లుగా సర్కిల్లో తిష్ఠవేసి.. అక్రమార్కులను పెంచి పోషిస్తూ.. నెలవారీగా మాముళ్లను లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. నెలవారీ మాముళ్లే కాదు.. స్పెషల్ టాస్కులు.. స్పెషల్ రాబడీల్లోనూ తన వాటాను గట్టిగానే పుచ్చుకుంటూ అవినీతి అధికారులకు వెన్ను దన్నుగా నిలుస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఇటీవల ఖమ్మం ఎఫ్ ఆర్వో నాగేశ్వర్రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉన్నతాధికారులకు రిఫరెన్స్చేసే స్థాయికి అధికారి దిగజారినట్లు సమాచారం. నాగేశ్వర్రావుకు అనుకూలంగా రిపోర్టు ఉండాలని, ఆయనకు నెగటివ్‌గా రిపోర్ట్ రాకుండా చూడాలని జిల్లా స్థాయిఅధికారులను గట్టిగానే తన పద్ధతిలో కోరినట్లుగా తెలుస్తోంది.
నాలుగేళ్లుగా సొంత రాజ్యం..!
అటవీశాఖ భద్రాద్రి సర్కిల్ పరిధిలోని వరంగల్, హన్మకొండ,మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై పర్యవేక్షణ చేసే బాధ్యతల్లో ఉన్న సదరు అధికారి.. ఏ విషయాన్ని అంత మాములుగా వదిలేయడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సార్‌కు ముట్టాల్సినవి ముట్టాల్సిందే.. గిట్టాల్సింది గిట్టనిదే నిద్రపోనివ్వడన్న చర్చ డిపార్ట్మెంట్ వర్గాల్లో జరుగుతోంది. సర్కిల్లో కీలక స్థానంలో పనిచేస్తున్న సదరు అధికారి నాలుగేళ్లకు పైబడి కూర్చుని వదలకుండా పాతుకుపోయిన ఆ అధికారి మొత్తం శాఖనే భ్రష్టు పట్టిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. అక్రమాలకు వెన్నుదన్నుగా నిలవడమే కాదు.. అక్రమాల్లోనూ వాటాలు పుచ్చుకుంటున్నట్లు సమాచారం. అక్రమార్కులపై ఆరోపణలు వస్తే..డిపార్ట్మెంట్ చర్యలకు దిగితే.. ముందు సారే అడ్డుపడుతుండటం గమనార్హం. అంతేకాదు.. ఇలా వేటు పడినా అధికారుల నుంచి పోస్టింగ్‌ల కోసమంటూ లక్షల్లో వసూళ్లకు పాల్పడుతూ ధనార్జనే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అక్రమార్కులకు సార్ అభయ హస్తం
ఖమ్మం ఫారెస్ట్ రేంజర్‌గా పనిచేస్తున్న నాగేశ్వర్రావు అధికారి తప్పుడు బిల్లుల పేరుతో మోసానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంత జరిగిన ఆ అధికారిని సర్కిల్లో కీలక స్థానంలోని ఉన్నతాధికారి కాపాడేందుకు విశ్వప్రయత్నం చేసినట్లు సమాచారం. వాస్తవానికి ఇప్పటికే ఐదు నుంచి ఆరుసార్లు ఖమ్మం రేంజర్ ను కాపాడినట్లుగా బలమైన ఆరోపణలున్నాయి. ఈ ఉన్నతాధికారి చేతిలో ఐదు జిల్లాలు ఉండడమే గాక ఈ జిల్లాల్లో పనిచేసే సిబ్బంది నీ సైతం పర్యవేక్షిస్తూ వారి స్థానాల్లో పోస్టింగ్‌లు పొందాలన్నా, ఉద్యోగోన్నతులు సక్రమంగా రావాలన్నా, క్రమశిక్షణ చర్యలు జరగకుండా ఉండాలన్నా.. సార్‌కు లక్షల్లో సమర్పించుకోవాల్సిదేనంట. ఖమ్మం ఘటనలో అధికారిని కాపాడేందుకు సదరు అధికారే స్వయంగా జిల్లా స్థాయి అధికారులకు రిపోర్టులు తాను చెప్పినట్లుగా రావాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే విజిలెన్స్ అధికారులు సీరియస్‌గా ఉన్నట్లుగా గ్రహించిన జిల్లా అధికారులు ఏం జరిగిందో అదే పంపడంతో సార్ ఆటలు సాగలేదని తెలుస్తోంది. అయితే ఇంతజరిగినా..సస్పెన్షన్ వేటు పడిన అధికారికి ఏం ఫర్వాలేదు నేనున్నా..త్వరలోనే మరోచోట పోస్టింగ్ వస్తుంది కంగారుపడకు..ఆందోళన చెందకంటూ భరోసా ఇచ్చినట్లుగా డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతోంది.
పథకాల నిధుల్లోనూ మేత..
అటవీ శాఖ పరిపాలనలో పలు పథకాలను అమలు చేస్తుంటారు. ప్రత్యేకించి తెలంగాణ కాంపన్సేటరీ ఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (సీఏఎంపీఏ) పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తారు. అటవీ భూమి, పర్యావరణ వ్యవస్థ సేవలు నష్టపోయినట్లయితే పరిహారం ద్వారా అటవీకరణను పెంచడం, సహజ పునరుత్పత్తి సహాయంతో అడవుల నాణ్యతను మెరుగుపర్చడం, జీవ వైవిధ్యాన్ని సుసంపన్నం చేయడం, వన్యప్రాణుల అవాసాలను మెరుగుపర్చడం, అటవీ అగ్ని నియంత్రణ, అటవీ రక్షణ, నేల, నీటి సంరక్షణ కోసం ప్రతిఏటా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను మంజూరు చేస్తారు. కమిటీలను ఏర్పాటు చేసి వీటి ద్వారానే అడవుల్లో చెక్‌డ్యామ్ నిర్మాణ పనులు, నీటికుంటలు, పూడిక తీత పనులు, మొక్కలు నాటడం, అడవుల్లో విత్తనాలు చల్లించడం తదితర పనులను చేపడతారు. అయితే ఈ పథకాలకు సంబంధించి కేటాయించిన నిధుల వినియోగంలో కూడా సదరు ఉన్నతాధికారి ఎఫ్ ఆర్వోలతో కలిసి నిధుల గోల్మాల్ చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్లుగా ఒకే సర్కిల్లో పని చేసుకుంటూ అందిన కాడికి దండుకుంటూ తనకు నచ్చిన సిబ్బందిని అక్కున చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. సదరు అధికారి ఏ ప్రభుత్వం ఏర్పడిన సంబంధిత శాఖ మంత్రులను, రాష్ట్ర ,కేంద్రస్థాయి ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటూ శాఖకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని విమర్శలు ఉన్నాయి. అక్రమ పర్మిట్ట విషయంలో ఉన్నతాధికారి పాత్రపై నా కూడా ఎంక్వయిరీ జరుగుతున్నట్లుగా తెలుస్తుండగా, ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి సదరు అధికారి చెర నుంచి సర్కిల్‌ను తప్పించాలని డిపార్ట్మెంట్లోని నిజాయితీ అధికారులు కోరుతుండటం గమనార్హం.


