ప్రజాస్వామ్య నిరసనకు అడ్డంకులు..
‘మర్యాదగా చెప్పా.. ఇంకా రెండేళ్ల పాలన ఉంది’
పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాట్ కామెంట్స్
కాకతీయ, మణుగూరు : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత *కేసీఆర్*పై సిట్ విచారణ పేరుతో వేధింపులు జరుగుతున్నాయని నిరసనగా బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవాలని చూశారని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోపించారు. మణుగూరులో ఆదివారం నిర్వహించిన ధర్నా సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రేగా కాంతారావు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీలు, కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అలాంటి నిరసనలను మణుగూరులో కాంగ్రెస్ నాయకులు కౌంటర్‌గా వచ్చి అడ్డుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. “ఇప్పటిదాకా మంచిగా, మర్యాదగా చెప్పా. మీ పాలన ఇంకా రెండేళ్లు ఉంది—కౌంటర్ లెక్క పెట్టుకోండి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన వద్ద “66 వీడియోలు ఉన్నాయి” అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత రాజకీయ వేడిని పెంచాయి. “ఎవరినీ వదిలిపెట్టను… నేనేంటో కూడా రుచి చూపిస్తా” అంటూ రేగా చేసిన వ్యాఖ్యలు అక్కడి వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చాయి. కౌంటర్ ఇచ్చిన నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తూ, త్వరలోనే “వారి సంగతి తెలుస్తుంది” అని అన్నారు.
ఉద్రిక్తత.. పోలీసుల జోక్యం
ఈ వ్యాఖ్యల అనంతరం ధర్నా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో పరస్పర ఆరోపణలు కొనసాగుతుండగా, మణుగూరులో జరిగిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.


