ఇక ఖమ్మంలో రాజకీయ పోరాటమే
పరిపాలనలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం
నీళ్ల కుట్రలపై ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం
సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ అజాగ్రత్త
యూరియా బస్తాలందక రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి
అధినేత కేసీఆర్ హెచ్చరికలు నిజమవుతున్నాయి
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఈ నూతన సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో పోరాటాల నామసంవత్సరంగా నిలవనుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఒక్క రోజు కేసీఆర్ ప్రెస్ నోట్ విడుదల చేయగానే కాంగ్రెస్ నాయకుల్లో భయం మొదలవడం వారి వైఫల్య పాలనకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు అందించిన చరిత్ర ఉందని, అదే స్థాయిలో పాలన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదని విమర్శించారు. రానున్న అన్ని ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే బీఆర్ఎస్ ఘన విజయాలు సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.

ప్రాజెక్టుల్లో కాంగ్రెస్ కుట్రలపై బీఆర్ఎస్ పోరాటం
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అజయ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ పూర్తి చేసిన పనులపై పంపులను ఆన్ చేసి సీతారామ ప్రాజెక్టు నీళ్లను రాజకీయ ప్రచారానికి వాడుకుంటూ, తదుపరి పనులను మాత్రం ముందుకు సాగనీయకపోవడం కాంగ్రెస్ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అజాగ్రత్త త్వరలోనే నీళ్ల ఉద్యమంగా మారడం ఖాయమని హెచ్చరించారు.
ఖమ్మం నియోజవర్గంలో ఎన్నికల సమయంలో “సీతారామ నీళ్లతో కడుగుతా” అని హామీ ఇచ్చి గెలిచిన కాంగ్రెస్ నాయకుడు ఇప్పటికైనా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే, కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ ముందే చేసిన హెచ్చరికలు అక్షరాలా నిజమవుతున్నాయని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రతి తెలంగాణ బిడ్డకు ఇప్పుడు అర్థమవుతోందన్నారు.
కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలి
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లను సత్కరిస్తూ జిల్లా పర్యటనలు చేస్తున్నారని అజయ్ కుమార్ తెలిపారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు కేటీఆర్ ఖమ్మం జిల్లాకు రానున్నారని, జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఉమ్మడి జిల్లా సర్పంచులు, వార్డు మెంబర్లను ఘనంగా సత్కరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.


