తగ్గేదేలే..!పల్లెల్లో ‘నువ్వా నేనా’ రాజకీయ రంగు
వామపక్షాల వ్యూహాత్మక అడుగులు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికల సందడి దగ్గరపడుతుండటంతో పల్లెబాటల్లో రాజకీయ పార్టీలు దూసుకెళ్తున్నాయి. గెలుపు—ఓటముల లెక్కలు వేసుకుంటూ ‘నువ్వా నేనా’ అన్నట్లుగా ప్రధాన పార్టీలు గ్రామాల్లో కాలు దువ్వుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వామపక్ష పార్టీల దూకుడు మరింతగా కనిపిస్తోంది. పల్లె ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రంగా చేసుకొని సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల జల్లు కురిపిస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఎండగడుతూ వామపక్షాలు గ్రామాల్లో తమ బలం పెంచుకోవడంలో పరుగులు పెడుతున్నాయి.
వామపక్షాల వ్యూహాత్మక అడుగులు
రేగళ్ల, మైలారం, గట్టు మల్ల, బంగారు చిలక వంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో “ఎలాంటి పోటీ అయినా తగ్గేదేలే” అంటూ వామపక్షాలు సిద్ధమైపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో శక్తినిరూపణకు ఇదే సరైన సమయమని భావించి ప్రతి పంచాయతీని లక్ష్యంగా చేసుకొని కేడర్‌ను కదిలిస్తున్నాయి. కొన్ని పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుల మాటే లేదని స్పష్టం చేస్తూ సింగిల్‌గా బరిలోకి దిగేందుకు వామపక్షాల్లో సిద్ధంగా కనిపిస్తున్నాయి. తమ బలం, కేడర్‌పై ఉన్న నమ్మకమే ఈ ధైర్యానికి కారణమని నాయకులు చెబుతున్నారు. వార్డు మెంబర్ల నుండి సర్పంచ్ వరకు నిర్ణయాలు ఫైనల్
స్థానికస్థాయిలో వార్డు మెంబర్ల ఎంపిక నుంచి సర్పంచ్ అభ్యర్థుల ఖరారు దాకా—పూర్తిగా పార్టీ నాయకత్వమే బాధ్యత తీసుకుంది. “మా అభ్యర్థి గెలవడం ఖాయం” అని ప్రతి పంచాయతీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద… ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం కాకముందే రాజకీయ ఉత్కంఠ పెరిగింది. పల్లెల్లో తగ్గేదేలే నినాదాలు మోగుతుండగా, రాబోయే రోజుల్లో ప్రచారం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.


