ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు
తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోజడ్ల పుల్లారావు
కాకతీయ, బోనకల్ : మధిర బార్ అసోసియేషన్ ఏ రాజకీయ పార్టీకి ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించలేదని అసోసియేషన్ అధ్యక్షుడు బోజడ్ల పుల్లారావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మధిర కోర్టులో సేవలు అందిస్తున్న న్యాయవాదులు విభిన్న రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నారని, అందరి తరఫున ఒకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు వార్తలు రావడం దురదృష్టకరమన్నారు. కోర్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారం గురించి మాట్లాడేందుకు అధికార పార్టీ నాయకులు ఆహ్వానించారని, దానిని ఆధారంగా చేసుకుని అసోసియేషన్ మొత్తం కాంగ్రెస్‌కు మద్దతు తెలిపినట్లు ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. న్యాయవాదులు విద్యావంతులు, తమ తమ రాజకీయ అభిప్రాయాలను వ్యక్తిగతంగా కలిగి ఉంటారని చెప్పారు. తాను వ్యక్తిగతంగా సీపీఎం రాజకీయాలను అభిమానిస్తానని, అయితే ఇతర లాయర్ల అభిప్రాయాలను పూర్తిగా గౌరవిస్తానని తెలిపారు. మధిర అభివృద్ధి ప్రశ్నించే గొంతుక ద్వారానే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.


