- అతివృష్టితో రైతులకు తీవ్ర నష్టాలు
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హేమంతరావు
కాకతీయ, ఖమ్మం : రైతాంగం దెబ్బతిన్న ప్రతిసారి పంటల నష్టపరిహారం అంచనా వేయడం వరకే ప్రభుత్వం పరిమితమవుతుందని, పరిహారం పరిహాసంగా మారుతుందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు బాగం హేమంతరావు ఆరోపించారు. ప్రకృతి విపత్తు ఏర్పడిన ప్రతిసారి పాలకులు పంటల అంచనాలంటూ ప్రకటనలకే పరిమితమవుతున్నారన్నారు. రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఖమ్మంలో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేష్ అధ్యక్షత జరుగగా ముఖ్య అతిథిగా హేమంతరావు హాజరై మాట్లాడారు. ఈ ఏడాది అతివృష్టి రైతులను తీవ్రంగా నష్టపరిచిందన్నారు. మొన్నటి వరకు అతివృష్టితో మెట్ట పంటలైన పత్తి, అపరాలు, ఉద్యానవన పంటలు దెబ్బతినగా మొంథా తుఫాన్ కారణంగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రకృతి సైతం రైతులపై పగబట్టినట్లుగా ఉందని హేమంతరావు తెలిపారు. పత్తి, వరి రైతులకు వెంటనే పరిహారం అందించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు జాగర్లమూడి రంజిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


