అభివృద్ధి కాదు.. పేదలపై దాడి
కూరగాయల మార్కెట్ మూసివేతతో పేదలకు అన్యాయం
ఖమ్మం జిల్లా మైనార్టీ అధ్యక్షులు తాజుద్దీన్
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని 44వ డివిజన్‌లో కూరగాయల మార్కెట్‌ను మూసివేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మార్కెట్ మూసివేత అభివృద్ధి చర్య కాదని, పేద చిరు వ్యాపారస్తుల కడుపుపై చేసిన రాజకీయ దాడిగా ఖమ్మం జిల్లా మైనార్టీ అధ్యక్షులు తాజుద్దీన్ ఆరోపించారు.
గతంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముస్లిం మైనార్టీ పేద కూరగాయల వ్యాపారస్తుల కోసం అన్ని మౌలిక వసతులతో ఈ మార్కెట్‌ను నిర్మించి అందించారని గుర్తు చేశారు. ప్రజలు ఆ సేవలను మరిచిపోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు టెండర్ల పేరుతో షాపులను ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. రోజువారీ కూరగాయల వ్యాపారంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్తులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్న అధికార పార్టీ నిర్ణయాలు అన్యాయమని పేర్కొన్నారు. నిజంగా కొత్త షాపుల అవసరం ఉంటే, టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పాత కూరగాయల మార్కెట్‌ను పునరుద్ధరించాలని సూచించారు. ఇప్పటికీ అక్కడే వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబాలపై దాడి చేయడం సరికాదన్నారు. ఈ అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కార్పొరేషన్ అధికారులు, అధికార పార్టీ నాయకులు ప్రజలకు వెంటనే సమాధానం చెప్పాలని తాజుద్దీన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం అక్కడ వ్యాపారం చేస్తున్న ముస్లిం మైనార్టీ వ్యాపారస్తులకు షాపులు దక్కకుండా నష్టం కలిగిస్తే, బీఆర్ఎస్ పార్టీ పక్షాన చిరు వ్యాపారస్తుల తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం నగర ప్రజలకు రోజువారీ కూరగాయలు అందిస్తూ జీవనం సాగిస్తున్న పేదలపై రాజకీయాలు చేయవద్దని హితవు పలికిన తాజుద్దీన్, ప్రజల పక్షాన నిలబడ్డ నాయకుడిగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సేవలను ఖమ్మం ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు.


