- నిర్ణీత లక్ష్యం మేరకు రైస్ డెలివరీ పూర్తి చేయాలి
- అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
- 20 రోజులలో పెండింగ్ బియ్యం అందజేయాలి
- పెండింగ్ రా రైస్ డెలివరీపై రైస్ మిల్లర్లతో సమావేశం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: నిర్ణీత లక్ష్యం మేరకు రైస్ డెలివరీ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం పెండింగ్ రా రైస్ డెలివరీ పై రైస్ మిల్లర్లతో ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా నుంచి గత ఖరీఫ్ సీజన్ పెండింగ్ ఉన్న 11 వేల 500 మెట్రిక్ టన్నులు రా రైస్, బాయిల్డ్ రైస్ 3500 మెట్రిక్ టన్నులు రాబోయే 20 రోజుల పని దినాలలో ఎఫ్.సి.ఐ. కు రైస్ మిల్లర్లు సరఫరా చేయాలని అన్నారు.
రైస్ మిల్లర్లు రైస్ సరఫరా చేసేందుకు వీలుగా ఎఫ్.సి.ఐ.అధికారులు గోదాముల్లో స్పేస్ అందుబాటులో పెట్టాలని, గోదాంలకు కనీస అప్రోచ్ రోడ్డు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. జిల్లా నుంచి గత రబీ సీజన్ కు సంబంధించి పెండింగ్ ఉన్న 42 వేల మెట్రిక్ టన్నుల రైస్ డెలివరీకు రోజుకు 600 మెట్రిక్ టన్నుల సరఫరా దాటడం లేదని, దీనికి కారణాలను అదనపు కలెక్టర్ ఆరా తీశారు. మిల్లర్ల దగ్గర ఉన్న నాణ్యమైన గన్ని బ్యాగులను తీసుకునేలా చర్యలు చేపడతామన్నారు.
పిడిఎస్ బియ్యాన్ని ఎవరూ కొనుగోలు చేయవద్దని, ఎవరైనా కొనుగోలు చేసినట్లు తెలిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. సన్న వడ్ల మిల్లింగ్ సామర్థ్యం, అందులో ఉన్న సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాయాలన్నారు. ఖరీఫ్ ధాన్యం కేటాయింపులకు రైస్ మిల్లర్లు తప్పనిసరిగా 10 శాతం బ్యాంకు గ్యారెంటీ సమర్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, ఎఫ్.సి.ఐ. అధికారులు, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వర్ రావు, మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు.


