యూరియా స్టాక్‌పై ఆందోళన వద్దు
జిల్లాలో 13,795 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో
రైతులకు కూపన్లతో క్రమబద్ధమైన పంపిణీ
అవసరానికి మించి కొనుగోలు చేయొద్దు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నాగులవంచ యూరియా కేంద్రంలో కొనుగోలు ప్రక్రియ పరిశీలన
కాకతీయ, ఖమ్మం/చింతకాని : ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎలాంటి అపోహలు నమ్మి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. శనివారం చింతకాని మండలం నాగులవంచ గ్రామంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన యూరియా సేల్ పాయింట్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ యూరియా కొనుగోలు చేస్తున్న రైతులతో నేరుగా మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. జిల్లాలో యూరియా సమృద్ధిగా ఉందని, రైతులందరికీ అవసరమైన మేరకు పంపిణీ చేస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
స్టాక్ వివరాలు వెల్లడించిన కలెక్టర్
జిల్లాలో ప్రస్తుతం మొత్తం 13,795 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. మార్క్‌ఫెడ్ వద్ద 9,736 మెట్రిక్ టన్నులు, ప్యాక్స్ వద్ద 900 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 663 మెట్రిక్ టన్నులు, అలాగే గతంలో ఉన్న సీఆర్‌పీ స్టాక్ 2,495 మెట్రిక్ టన్నులు కలిపి ఈ నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రతి 2,000 ఎకరాల సాగు విస్తీర్ణానికి ఒక యూరియా సేల్ పాయింట్ ఉండేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ చెప్పారు. రైతులు యూరియా తీసుకునే సమయాన్ని ముందుగానే తెలియజేస్తూ కూపన్లు జారీ చేస్తున్నామని, దీనివల్ల గందరగోళం లేకుండా పంపిణీ జరుగుతోందన్నారు. రైతులు అధికారులకు సహకరించి సూచించిన సమయానికే వచ్చి యూరియా తీసుకెళ్లాలని కోరారు.
అధిక కొనుగోళ్లపై హెచ్చరిక
ఒక్కో రైతుకు అతని సాగు విస్తీర్ణానికి అవసరమైన మేరకే యూరియా అందిస్తామని, అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని కలెక్టర్ స్పష్టంగా సూచించారు. అధికంగా నిల్వ చేసుకోవడం వల్ల ఇతర రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య, జిల్లా సహకార శాఖ అధికారి గంగాధర్, మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు విజయ్ చంద్ర, చింతకాని తహసీల్దార్ బాజ్జీ ప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


