బీజేపీ పగ్గాలు నితిన్ నబిన్‌కే!
జనవరి 20న అధికారిక ప్రకటనకు ముహూర్తం
యువ నేతకు అధిష్ఠానం పెద్దపీట
అగ్రనేతల సంపూర్ణ మద్దతుతో ఏకగ్రీవం
కాకతీయ, నేషనల్ డెస్క్ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవిపై ఉత్కంఠకు తెరపడనుంది. పార్టీ నూతన సారథిగా యువనేత నితిన్ నబిన్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జనవరి 20న కొత్త అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటించేందుకు అధిష్ఠానం సిద్ధమైంది. పార్టీ భవిష్యత్ అవసరాలు, యువతలో పట్టు పెంచుకునే వ్యూహంలో భాగంగా నితిన్ నబిన్‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముందు జరగాల్సిన సంస్థాగత ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే మెజారిటీ చోట్ల అంతర్గత ఎన్నికలు పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారం అవసరమైన సంఖ్యకు మించి రాష్ట్రాల్లో ప్రక్రియ ముగియడంతో జాతీయ అధ్యక్ష ఎన్నికకు మార్గం సుగమమైంది. జనవరి 15 తర్వాత రాష్ట్ర అధ్యక్షులను ఢిల్లీకి పిలవనుండగా, 18 నుంచి 20 మధ్య ఎన్నికల తంతు పూర్తికానుంది.
మోదీ–షా ఆశీస్సులు
నితిన్ నబిన్ అభ్యర్థిత్వానికి పార్టీ అగ్రనేతల సంపూర్ణ మద్దతు లభించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా నామినేషన్‌పై సంతకం చేసే అవకాశం ఉందని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదకుడిగా వ్యవహరించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు నామినేషన్ల ద్వారా మద్దతు తెలపనున్నారు. బీజేపీ సంప్రదాయం ప్రకారం ఈసారి కూడా జాతీయ అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నితిన్ నబిన్ ఒక్కరే నామినేషన్ వేయనున్నారని, పోటీ ఉండే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నామినేషన్ల పరిశీలన అనంతరం ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ కీలక ఘట్టానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు హాజరుకానున్నారు.
కొత్త అధ్యాయానికి ఆరంభం
యువ నాయకత్వంతో పార్టీని మరింత బలోపేతం చేయడం, రానున్న ఎన్నికలకు దూకుడు వ్యూహం రూపొందించడం నితిన్ నబిన్ ముందున్న ప్రధాన సవాలుగా మారనుంది. జనవరి 20తో బీజేపీలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


