27 ఏళ్ల స్నేహబంధానికి నూతనోత్సాహం
పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికతో భావోద్వేగాలు
స్నేహానికి గుర్తుగా 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
కాకతీయ, కల్లూరు : చండ్రుపట్ల జెడ్‌పీఎస్‌ఎస్‌లో 1993–98 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 27 సంవత్సరాల అనంతరం అపూర్వంగా కలుసుకుని తమ స్నేహాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. సుమారు 60 మంది విద్యార్థులు మామిడితోటలో సమావేశమై చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.ఆనందభాష్పాలతో ఒకరినొకరు పలకరించుకుంటూ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. కార్యక్రమానికి ముందు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అందరి ఫోటోలను సేకరించి రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్‌ను స్నేహానికి గుర్తుగా ఆవిష్కరించారు. పూర్వ విద్యార్థుల్లో కొందరు ఉద్యోగాల్లో, మరికొందరు వ్యవసాయ రంగాల్లో స్థిరపడినట్లు తెలిపారు. ప్రతి ఏడాది ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ పరస్పర సహకారం కొనసాగించాలని నిర్ణయించారు. హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ కలయికకు మరింత ఉత్సాహం నింపారు. స్నేహబంధం కాలానికి అతీతమని ఈ కార్యక్రమం మరోసారి నిరూపించింది


