చేర్యాల ప్రభుత్వ హాస్పత్రిలో నిర్లక్ష్యం
* కడుపునొప్పితో బాధపడుతూ ప్రభుత్వ హాస్పత్రికి పెషేట్
* ప్రధాన ద్వారం మూసిఉంచడంతో వేణుదిరిగిన వెళ్లిన వైనం
* సిబ్బందికి మెమో జారీ చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్
* పట్టుకొని అధికారులు,పాలకులు
కాకతీయ, చేర్యాల: చేర్యాల చుట్టుపక్కల ప్రజలకు వైద్య సేవ లందించేందుకు ఏరియా ప్రభుత్వాస్పత్రిని 30 పడకలు ఉండగా ఇటీవల ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో చేర్యాల పరిధిలోని బిడి కాలనీ పరిధిలో హాస్పత్రిని నిర్మించి 50 పడకలకు గాను సరిపడేంతగా మార్చేశారు. ఆస్పత్రి అభివృద్ధి చెంది నూతన భవనాల్లోకి మారింది గానీ అక్కడ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు ఆధునిక సౌకర్యాలు, నూతన భవనాలు, ఔషధాలు, ఆసుపత్రిలో సరిపడినంత వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తూ.. ముందుకెళ్తున్నాయి. అయినా కూడా కొంతమంది పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రులను నమ్మడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అంటే జంకుతున్నారు. దీనికి కారణం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అప్పుడప్పుడు జరిగే కొన్ని ఘటనలు. దానిలో ముఖ్యంగా ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం. కొంతమంది వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో సంభవించే ఘటనలు ప్రభుత్వ ఆసుపత్రుల పైనా ఉన్న కొద్ది నమ్మకాన్ని కూడా పోగొట్టేలా చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే చేర్యాల మండల పరిధిలోని ఆకునూరు గ్రామానికి చెందిన శిగుళ్ల వీరేష్ (23) అనే వ్యక్తికి విపరీతమైన కడుపునొప్పి రావడంతో శనివారం మధ్యరాత్రి 2 గంటలకు వీరేష్ కుటుంబ సభ్యులు అతడిని చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వీరేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం మూసివేయడంతో కడుపునొప్పి బాధపడుతున్న వీరేష్ కుటుంబ సభ్యులు వైద్యులను లేపే ప్రయత్నం చేయగా అరగంటకు పైగా ఎంత మొరపెట్టుకున్నప్పటికీ సిబ్బంది,వైద్యులు మేల్కొనలేదు.అక్కడ సెక్యూరిటీ గార్డు అదుబాటులో లేకపోవడం గమనార్హనికి దారితీసింది. వీరేష్ కు కడుపునొప్పి భరించలేకపోవడంతో వెంటనే చేర్యాలలోని వెంకటసాయి హాస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు వీరేస్ కు వైద్యం అందించి ప్రాణపాయం నుంచి కాపాడరని వీరేష్ కుటుంబ సభ్యులు. తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైద్యులపై,సిబ్బంది పై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని వీరేష్ కుటుంబ సభ్యులు కోరారు.
సిబ్బందికి మెమో జారీ చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్
జరిగిన ఘటనపై విచారణ చేపట్టిన ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవేందర్ విధుల్లో ఉండి నిర్లక్ష్యం వహించిన స్టాప్ నర్సు సరిత, ఏఎన్ఎం జ్యోతి, వార్డు భాయ్ నర్సింహులు కు శనివారం మేము జారీ చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు.


