నేషనల్ హెరాల్డ్ కేసు.. రాజకీయ ప్రతీకారమే!
కోర్టు తీర్పుతో బీజేపీకి చెంపదెబ్బ
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరుబాట
కాకతీయ, కొత్తగూడెం : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును ఢిల్లీ కోర్టు స్వీకరించడానికి నిరాకరించడంపై భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్యేనని డీసీసీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్న అన్నారు. ధర్నాలో మాట్లాడిన దేవి ప్రసన్న, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్‌లు.. గాంధీ కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా నేషనల్ హెరాల్డ్ కేసును కేంద్ర ప్రభుత్వం వాడుక రాజకీయ ఆయుధంగా మార్చిందని విమర్శించారు. కోర్టు తీర్పు మోడీ, అమిత్ షాలకు చెంపదెబ్బ లాంటిదని పేర్కొన్నారు.
మోడీ–అమిత్ షాల రాజీనామా డిమాండ్
ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఈడీని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆరోపించారు. ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడిన ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు, బేతంపూడి సర్పంచ్ వాంకుడోత్ శ్రీకాంత్, సుజాతనగర్ మండల పార్టీ అధ్యక్షుడు చింతలపూడి రాజశేఖర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


