సమస్యల పరిష్కారానికి బాధ్యతగా పనిచేయాలి
కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ ఆదివారం కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా 3టౌన్ సీఐ శివప్రసాద్ డీఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.డీఎస్పీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేయడంతో పాటు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్‌కు వివిధ సమస్యలతో వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని డీఎస్పీ రెహమాన్ సూచించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకుని, పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించేలా కృషి చేయాలని ఆదేశించారు.
వర్టికల్స్ వారీగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఒక్కొక్కరిగా వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన
ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతరం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాల ద్వారా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్ 100కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలవాలని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను డీఎస్పీ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో 3టౌన్ సీఐ శివప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై ప్రవీణ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


