కల్లూరులో మోహన్ నాయక్ అరుదైన ఘనత
తొలి సర్పంచ్‌గా… తొలి చైర్‌పర్సన్‌గా చరిత్ర
వైస్ చైర్‌పర్సన్‌గా శీలం కోటేశ్వరి ప్రమాణ స్వీకారం
ప్రత్యేక సమావేశంలో ఎన్నిక ప్రక్రియ పూర్తి
పట్టణ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని మోహన్ నాయక్ హామీ
కాకతీయ, కల్లూరు : కల్లూరు పట్టణ రాజకీయాల్లో అరుదైన చరిత్ర సృష్టించబడింది. కొత్తగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీ తొలి చైర్‌పర్సన్‌గా ధరావత్ మోహన్ నాయక్ ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల ప్రక్రియను అధికారులు పూర్తి చేసి, ఆయనతో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో నూతన మున్సిపల్ పాలనకు శ్రీకారం చుట్టినట్లైంది. గతంలో హనుమ తండా గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసిన సమయంలో తొలి సర్పంచ్‌గా ఎన్నికైన మోహన్ నాయక్, ఇప్పుడు కల్లూరు మున్సిపాలిటీకి తొలి చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడం ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఒకే నాయకుడు రెండు కొత్త స్థానిక సంస్థల్లో తొలి పదవులను అధిరోహించడం స్థానిక రాజకీయాల్లో అరుదైన ఘట్టంగా మారింది. ఈ పరిణామం ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక మైలురాయిగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

వైస్ చైర్‌పర్సన్‌గా శీలం కోటేశ్వరి
అదేవిధంగా మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌గా శీలం కోటేశ్వరి ఎన్నికయ్యారు. ప్రత్యేక సమావేశంలో ఎన్నికైన అనంతరం ఆమెకు అధికారులు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తవడంతో మున్సిపల్ పాలకవర్గం అధికారికంగా బాధ్యతలు చేపట్టింది. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోహన్ నాయక్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా మెరుగుదల, పారిశుధ్య వ్యవస్థ బలోపేతం, రహదారుల విస్తరణ, వీధి దీపాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.


