- 1.7 కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకే ధన్ ధాన్య క్రుషి యోజన
- కరీంనగర్ డెయిరీకి కేంద్రం నుండి అన్ని విధాలా సహకారం అందిస్తా..
- డెయిరీ ప్రొడక్ట్స్ ను ఆపేందుకు కొందరు యత్నిస్తున్నారు
- లక్షమంది పాడి రైతులతో నడుస్తున్న సంస్థ ఇది
- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, కరీంనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల పక్షపాతి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు భారీగా పెరిగినప్పటికీ, ఆ భారం రైతులపై పడకుండా కేంద్రం భరిస్తోందని, రైతులకు సబ్సిడీ ధరకే యూరియాను అందించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. దేశంలోని 1.7 కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘‘ధన్-ధాన్య కృషి యోజన’’ అనే పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఏటా రూ.24 వేల కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. మొదట దశలో 100 జిల్లాల్లో అమలు చేస్తూ, ఒక్కో సంవత్సరం రూ.24 వేల కోట్ల చొప్పున ఆరేళ్ల పాటు నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు.
లక్ష మంది పాడి రైతుల జీవనోపాధి కరీంనగర్ డెయిరీ
నరేంద్ర మోదీ ఢిల్లీలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన రూ.42 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారని బండి సంజయ్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని కరీంనగర్ మిల్క్ డెయిరీ ప్రాంగణంలో ఆయన ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. అనంతరం కేంద్రం, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జికా) ఆర్థిక సహకారంతో రూ.90 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మించిన ఆటోమెటిక్ కర్డ్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరీంనగర్ డెయిరీ అనేది 27 ఏళ్ల చరిత్ర గల సంస్థగా, లక్ష మంది పాడి రైతుల జీవనోపాధికి ఆధారంగా నిలుస్తోందన్నారు. ఈ సంస్థ రోజుకు 2 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోందని, 40 లక్షల లీటర్ల పెరుగును విక్రయిస్తున్నదని తెలిపారు. ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధిని కల్పిస్తున్నదన్నారు. 2021లో ఈ డెయిరీకి 3 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కేంద్రం నుంచి నిధులు వచ్చాయని గుర్తు చేశారు.
కరీంనగర్ డెయిరీ అభివృద్ధిలో రాజేశ్వరరావు పాత్ర అనన్యసాధారణమని సంజయ్ అన్నారు. గతంలో డెయిరీ ఆస్తులను కబ్జా చేయాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు తాను కార్పొరేటర్ గా ఉద్యమాలు చేసి ఆ ఆస్తులను కాపాడామని ఆయన గుర్తు చేశారు. సిరిసిల్లలో డెయిరీని అధికారులు సీజ్ చేసినప్పుడు కలెక్టర్‌తో మాట్లాడి తిరిగి ప్రారంభించామన్నారు. కరీంనగర్ డెయిరీ ఉత్పత్తులను నిలిపేయడానికి రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు ప్రయత్నిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని బండి వెల్లడించారు. ఈ విషయంపై తాను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని, డెయిరీ ఉత్పత్తులు ఆగకూడదని, వాటిని మరింత విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశ ప్రయోజనాలే ప్రధానికి ప్రథమమని, అంతర్జాతీయంగా కూడా మోదీ తీసుకున్న పలు నిర్ణయాలు దేశ ప్రతిష్ఠను పెంచాయని అన్నారు.


