గులాబీలోకి వలసలు
అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి
విచిత్రంగా క్షేత్ర స్థాయి రాజకీయం
స్థానిక ఎన్నికల ముందు అధికార పార్టీలో కలవరం
యూరియా ఎఫెక్ట్.. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్న క్యాడర్
పార్టీ కండువా మార్చేస్తున్న కాంగ్రెస్ లీడర్లు
అనుకూలతను బట్టి బీజేపీ లేదా బీఆర్ఎస్‌లోకి చేరికలు
హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలకు మాజీ సర్పంచుల గుడ్ బై
వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మారుతున్న సీన్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : గ్రౌండ్‌లో పొలిటికల్ సీన్ మారుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీని వీడుతూ గులాబీ కండువా కప్పేసుకుంటుండటం అధికార పార్టీ పెద్దలను, ఎమ్మెల్యేలను సైతం కలవర పాటుకు గురిచేస్తోంది. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోనూ అధికార పార్టీ నుంచి గులాబీ పార్టీలోకి నేతలు జంప్ అవుతున్నారు. స్థానిక ఎన్నికలు మరి కొద్దిరోజుల్లో జరుగుతాయనే అధికార పార్టీ తరుచూ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. సహజంగా ఇలాంటి సమయంలో అధికార పార్టీ దన్నుగా ఉంటుందనే దృక్పథంతో పార్టీలో ఉంటూ టికెట్ లేదా ఇతర నామినేటెడ్, అభివృద్ధి పనులకు సంబంధించిన హామీలు, కాంట్రాక్టు వర్క్‌లు దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇందుకు భిన్నంగా రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌లోని గ్రామ, మండల స్థాయి నేతలు పార్టీని మార్చేస్తున్నారు. అవకాశాన్ని బట్టి.. సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ ఎస్ లేదా బీజేపీ వైపు అడుగులు వేస్తుండటం గమనార్హం.
క్యాడర్ నారాజ్..!
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా అనేక హామీలిచ్చింది. ఈనేపథ్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తున్న సదరు హామీలకు సంబంధించిన ఊసే లేదని, నిధులు కేటాయింపు చేసినా.. మంజూరు కావడం లేదని, అభివృద్ధి ప్రణాళికలు లేవని, ఆరు గ్యారంటీల్లో ఫ్రీ బస్సు మినహా ఏ హామీ సక్రమంగా గ్రౌండ్‌లో అమలు జరగడం లేదనే విమర్శలు ప్రతిపక్షాల నుంచే కాదు.. స్వతహాగా కాంగ్రెస్ పార్టీలోని క్యాడర్ నుంచి కూడా వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న అంశాలతో క్యాడర్ ఏకీభవించని పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు రాష్ట్రంలో నెలకొన్న ఎరువుల సంక్షోభంతో ప్రభుత్వం వైఫల్యంగా మారిందని భావిస్తుండటం గమనార్హం. సమయానికి ఎరువులను సమకూర్చడంలో.. సాగు, ఎరువుల ప్రణాళికను రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న అభిప్రాయం కాంగ్రెస్ క్యాడర్‌లో నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా గ్రామాల్లో ఆశించినంత అభివృద్ధి జరగడం లేదని పార్టీ మారిన నేతలు చెబుతున్నారు. రైతుల కష్టాలు తీరడం లేదు, గత ప్రభుత్వ అభివృద్ధే తప్పా కొత్తగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
రాజకీయ భవిష్యత్‌కు నిర్ణయాలు
కాంగ్రెస్ పార్టీలోని కొత్త-పాత వర్గాల మధ్య విబేధాలు పొడచూపుతుండటం కూడా కొంతమంది అధికార పార్టీని వీడటానికి కారణంగా తెలుస్తోంది. ముందు నుంచి ఉన్న లీడర్ల కంటే కూడా ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్యేలు పెద్దపీట వేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సమీకరణాలను ఆలోచించుకుని కూడా పార్టీని వీడుతున్న వారు ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో బీఆర్ ఎస్ పార్టీలోకి వలసలు పెరగడం గమనార్హం. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలానికి చెందిన దాదాపు ఏడుగురు సర్పంచులు కాంగ్రెస్, బీజేపీలను వీడుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎలో చేరారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో తనుగుల మాజీ సర్పంచ్ రామస్వామి, శంభునిపల్లి మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, పాపక్కపల్లి మాజీ సర్పంచ్ మహేందర్, శాయంపేట మాజీ సర్పంచ్ భద్రయ్య, నాగంపేట మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, రాచపల్లి సదానందం, జైద శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలంలోని రేకంపల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, క్రియాశీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం గులాబీ కండువా కప్పుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్లలో గురువారం మాజీమంత్రి దయాకర్‌రావు సమక్షంలో కొడకండ్ల మాజీ ఎంపీటీసీ 01, విజయలక్ష్మి (కాంగ్రెస్), అమరేందర్ రెడ్డి మాజీ ఏఎంసీ డైరెక్టర్ తో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మొత్తం 50 మంది కీలక నేతలు బీఆర్ ఎస్ పార్టీలోకి మారడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాలనుకుంటున్న నేతలు గ్రామాలు, మండలాల్లోని సమీకరణాలను బేరీజు వేసుకుంటూ బీఆర్ఎస్, బీజేపీల్లోని అనుకూలతలపై అంచనా వేస్తూ కాంగ్రెస్ పార్టీ కండువా మార్చేస్తుండటం గమనార్హం.
కట్టడి చేయకుంటే ప్రమాదమే..!
కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నైరాశ్యాన్ని, నిరసనను, అసమ్మతి నేతల మనసెరిగి పరిస్థితిని చక్క దిద్దుకోకుంటే స్థానిక ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎమ్మెల్యేలు కొందరికే ప్రాధాన్యం ఇవ్వడం.. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారిని దూరం పెట్టి ఫైళ్లు, పైరవీలంటూ తమ చుట్టూ తిరిగే వసూల్, పైసల్ రాజాలకే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అనేక తప్పిందాలతో.. ఆ పార్టీపై పెరిగిన వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్ వైపు రాష్ట్ర ప్రజలు చూశారని, అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న, పరిపాలనలో స్తబ్దత వంటి అంశాలు పార్టీకి, ప్రభుత్వానికి చేటుగా మారుతున్నాయన్న చర్చ సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తుండటం గమనార్హం. పార్టీలో విధానం మారకుంటే మరెంతో మంది పార్టీ మార్చేయడం ఖాయమని వరంగల్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ పొలిటిషన్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.


