చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలి
కలెక్టర్ జితేష్ పటేల్
చర్ల మండలంలో విస్తృత పర్యటన
ఎన్నిలక సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన
కాకతీయ, కొత్తగూడెం : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు వైద్యులు చిత్తశుద్ధితో సేవలు అందించాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ భద్రాచలం సబ్ కలెక్టర్ శ్రేష్టతో కలిసి విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ముందుగా చర్ల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఆసుపత్రిలోని ప్రతి వార్డు ఎమర్జెన్సీ గైనకాలజీ పీడియాట్రిక్ లేబర్ రూమ్ ల్యాబ్ ఫార్మసీ మొత్తం మౌలిక సదుపాయాలను సవివరంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు ఔషధాల లభ్యత పరికరాల పనితీరు పరిశుభ్రత వైద్య సిబ్బంది హాజరు రికార్డులు పరిశీలించారు. ఇన్ పేషంట్ వార్డ్ లో ఉన్న రోగులతో మాట్లాడుతూ వారికి అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో కొన్ని చోట్ల ఉన్న చిన్నచిన్న లీకేజీలు మరమ్మతులు గుర్తించిన కలెక్టర్ తక్షణమే సరిచేయాలని ఆదేశించారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాలు అభివృద్ధి పనులపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని వైద్య అధికారిని ఆదేశించారు. గర్భిణులకు, చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవల నాణ్యతను పరిశీలించి సిబ్బందిని అభినందించారు.
ఎన్నిలక సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన
అనంతరం కలెక్టర్ చర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలోని ప్రతి కౌంటర్‌ను పోలింగ్ సిబ్బందికి అందజేస్తున్న సామగ్రి పంపిణీ విధానాన్ని చెక్‌లిస్ట్ ప్రకారం జరుగుతున్న ప్రక్రియలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు సీసీ కెమెరాల పనితీరు భద్రతా సిబ్బంది హాజరు డబుల్ లాక్ సిస్టమ్‌ను పరిశీలించి ఎటువంటి భద్రతా లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బందితో మాట్లాడిన కలెక్టర్ ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా తప్పులు లేకుండా నిర్వహించడానికి ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలింగ్ సిబ్బందికి అవసరమైన సహకారం తక్షణమే అందించాలన్నారు. అనంరతం కలెక్టర్ సుబ్బంపేట గ్రామంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో కల్పించిన మౌలిక వసతులు వికలాంగులకు ఏర్పాటు చేసిన ర్యాంపులు త్రాగునీరు విద్యుత్ టాయిలెట్ సదుపాయాలు వెబ్‌కాస్టింగ్ కోసం అమర్చిన వీడియో కెమెరాల పనితీరును సమీక్షించారు. పోలింగ్ రోజున ఎటువంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు పూర్తి స్థాయిలో అమలులో ఉండాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ ఆర్.కొత్తగూడెంలోని శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటీ యూనిట్‌ను సందర్శించి మహిళలు తయారు చేస్తున్న ఇప్పపువ్వు లడ్డు బర్ఫీ చాక్లెట్ టీ పొడి నల్లేరు పచ్చడి తదితర ఉత్పత్తులను పరిశీలించారు. ఇప్పపువ్వు సేకరణ విధానం నాణ్యత నిల్వ విధానాలు మార్కెటింగ్ అవకాశాలపై సభ్యులతో చర్చించారు. ఇప్ప చెట్ల లెక్కింపు చేపట్టాలని సూచిస్తూ పండ్లు నేలపై పడకుండా నెమ్మదిగా సేకరించేందుకు అవసరమైన నెట్లను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పపువ్వు ఎండబెట్టేందుకు సోలార్ డ్రైయర్లు అవసరం ఉందని సభ్యులు కోరగా వాటి ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. పరిశీలనలో కలెక్టర్ వెంట ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ సాయి వర్ధన్, డాక్టర్ కాంత్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ శ్రావణి, చర్ల ఎంపీడీవో, ముత్యాలమ్మ జాయింట్ లైబిలిటీ యూనిట్ సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


