ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యశాఖ కొరడా
ఆర్‌ఎంపీ, పీఎంపీ క్లినిక్‌లకు నోటీసులు
ధరల పట్టిక తప్పనిసరిగా డిస్ప్లే చేయాలి
వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారం రాథోడ్
కాకతీయ, కొత్తగూడెం : ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారం రాథోడ్ స్పష్టం చేశారు. కొత్తగూడెం పట్టణంలోని పలు ప్రైవేటు వైద్య సంస్థలపై ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గాయత్రి నర్సింగ్ హోమ్, యామిని హాస్పిటల్, శీను ఈఎన్‌టీ హాస్పిటల్‌తో పాటు ఆర్‌ఎంపీ రమేష్, పీఎంపీ నియోమీ క్లినిక్‌లను పరిశీలించారు. ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవల జాబితా, వాటి ధరల పట్టిక ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. ఐటీడీఏ నిర్దేశించిన రేట్ల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని సూచించారు. విధులు నిర్వహిస్తున్న వైద్యుల పేర్ల జాబితా ప్రదర్శించడంతో పాటు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణను నిబంధనల మేరకు చేపట్టాలని హెచ్చరించారు. రిసెప్షన్ వద్ద అవసరమైన అన్ని అనుమతి పత్రాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. తనిఖీల్లో ఆర్‌ఎంపీ, పీఎంపీ క్లినిక్‌లలో అధిక శక్తి యాంటీబయాటిక్స్ నిల్వలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. రోగులకు ఇంజెక్షన్లు ఇవ్వడం, ల్యాబ్ రిఫరల్ స్లిప్‌లు జారీ చేయడం వంటి నిబంధనలకు విరుద్ధమైన చర్యలు గుర్తించామని పేర్కొన్నారు. ఈ కారణంగా రెండు క్లినిక్‌లకు నోటీసులు జారీ చేసి, ఆరు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎంపీహెచ్‌ఈఓ భద్రు, డీపీఎంఓ మోహన్ పాల్గొన్నారు.


