కాకతీయ, మెదక్ : మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని తాళ్లపల్లి తాండాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో నిరాశ చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బానోత్ కేశ్య కూతురు సక్కుబాయి (21) గత రెండేళ్లుగా నారాయణఖేడ్‌కు చెందిన కానిస్టేబుల్ సుధాకర్ అలియాస్ సిద్దు ప్రేమించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సక్కుబాయి అతనితో పెళ్లి చేసుకోవాలని కోరగా, సుధాకర్ మాత్రం దూరంగా ఉండడం ప్రారంభించాడు. చివరకు ఆమె ఫోన్ నెంబర్‌ను కూడా బ్లాక్ చేసినట్టు సమాచారం. ఈ పరిణామాలన్నింటి వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన సక్కుబాయి గడ్డి మందు తాగింది. ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


