కౌన్ బనేగా మేయర్
కొత్తగూడెం మేయర్ రేసులో ముగ్గురు
ఎస్టీ జనరల్ రిజర్వేషన్‌తో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ
సీపీఐలో మూడ్ గణేష్, కళావతి, నునావత్ శ్యామల మధ్య పోటీ
సీపీఐలో అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర, జిల్లా నేతల మథనం
కాంగ్రెస్‌లో ఉపమేయర్ పదవిపై తీవ్ర పోటీ
సోమవారం ఎన్నికపై కొత్తగూడెం రాజకీయాల్లో ఉత్కంఠ
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. ఎస్టీ జనరల్ రిజర్వేషన్ కింద జరుగుతున్న ఈ ఎన్నికలో సిపిఐ పార్టీ నుంచి ముగ్గురు నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మూడ్ గణేష్, కళావతి, నునావత్ శ్యామల మేయర్ రేసులో ఉండటంతో అసలు కుర్చీ ఎవరి ఖాతాలో పడుతుందన్నది హాట్ టాపిక్‌గా మారింది. కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ కీలక స్థానం దక్కించుకోవడంతో మేయర్ పదవిపై ఆ పార్టీ ఆశలు పెరిగాయి. కార్పొరేషన్ ఎన్నికలు సజావుగా ముగిసినా, మేయర్ ఎంపిక విషయంలో సిపిఐలో అంతర్గత పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపుతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ, ఎవరిని మేయర్‌గా ఎంపిక చేయాలన్న విషయంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం తలమునకలై చర్చలు కొనసాగిస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన నేతలందరికీ మేయర్ పదవిపై ఆశలు ఉండటంతో నిర్ణయం కీలకంగా మారింది.

సీపీఐలో ట్రయాంగిల్ ఫైట్
కొత్తగూడెం కార్పొరేషన్‌లో తొలిసారి మేయర్ పదవి దక్కించుకునే అవకాశం రావడంతో సిపిఐలో తీవ్ర పోటీ నెలకొంది. 31వ డివిజన్ కార్పొరేటర్ నునావత్ శ్యామల పేరు ఇప్పటికే ప్రధానంగా వినిపిస్తోంది. చదువుకున్న నాయకురాలిగా, పార్టీకి నిబద్ధతతో సేవలందించిన వ్యక్తిగా ఆమెకు మంచి గుర్తింపు ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సీతంపేట ప్రాంతానికి చెందిన మూడ్ గణేష్, కొత్తగూడెం ప్రాంతానికి చెందిన కళావతి పేర్లు కూడా మేయర్ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. ముగ్గురు అభ్యర్థులూ పార్టీకి విధేయులే కావడంతో ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో సిపిఐ నాయకత్వం తీవ్ర మథనం జరుపుతోంది. ఈ ట్రయాంగిల్ ఫైట్ మేయర్ ఎన్నికను మరింత ఆసక్తికరంగా మార్చింది.
కాంగ్రెస్‌తో ఒప్పందం… అధికార భాగస్వామ్యం
కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయినా, సిపిఐతో పొత్తు కుదుర్చుకుని అధికారంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సిపిఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఐదేళ్ల పదవీకాలంలో రెండున్నరేళ్లు సిపిఐ, మిగిలిన రెండున్నరేళ్లు కాంగ్రెస్ పార్టీకి మేయర్ పదవి దక్కేలా అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందంతో సిపిఐలో మేయర్ ఎంపికకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. మొదటి విడతలో మేయర్ పదవి సిపిఐకి దక్కనున్న నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై రాష్ట్ర కార్యవర్గం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉపమేయర్ పదవిపై పోటీ నెలకొంది. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు ఉపమేయర్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే నూకల సరిత, దుంపల రాజేష్ పేర్లు ఉపమేయర్ రేసులో వినిపిస్తున్నాయి. పార్టీ నాయకత్వం ఎవరికీ అవకాశం కల్పిస్తుందన్నది ఆసక్తిగా మారింది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో మేయర్, ఉపమేయర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా సిపిఐలో మేయర్ అభ్యర్థి ఎంపిక, కాంగ్రెస్‌లో ఉపమేయర్ పోటీ ఉత్కంఠ రేపుతున్నాయి. సోమవారం జరిగే ఎన్నికలతో మేయర్ కుర్చీ ఎవరి ఖాతాలో పడుతుందన్నది తేలనుంది.


