భూ నిర్వాసితులకు గరిష్ట పరిహారం
పంపుసెట్లు, చెట్లు, నిర్మాణాలకు ప్రత్యేక పరిహారం
రైతుల అభ్యంతరాల పరిష్కారానికి చర్యలు
సీతారామ ప్రాజెక్టుకు భూసేకరణపై కలెక్టర్ అనుదీప్ సమీక్ష
బాజు మల్లాయిగూడెం, రేలకాయపల్లి రైతులతో చర్చ
అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి
కాకతీయ, ఖమ్మం : సీతారామ ఎత్తిపోతల పథకం కోసం భూసేకరణలో భాగంగా నిర్వాసిత రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట పరిహారం మంజూరు చేసి, వారి ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సింగరేణి మండలం బాజు మల్లాయిగూడెం, రేలకాయపల్లి గ్రామాలకు చెందిన భూ నిర్వాసిత రైతులతో సమావేశమై సమస్యలు, పరిహారం అంశాలపై చర్చించారు. సీతారామ ఎత్తిపోతల పథకం 13వ ప్యాకేజీ నిర్మాణంలో భాగంగా భూసేకరణ చేపట్టాల్సి రావడంతో సంబంధిత గ్రామాల్లో భూ సర్వే నిర్వహించి అవార్డులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. ప్రభుత్వ లక్ష్యం ఒకవైపు ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయడం కాగా, మరోవైపు రైతులకు గిట్టుబాటు ధరతో న్యాయం చేయడమేనని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీటి సౌకర్యం పెరిగి, భూములు మరింత సారవంతమవుతాయని పేర్కొన్నారు.
చెట్లు, నిర్మాణాలకు కూడా ప్రత్యేక పరిహారం
భూమిలో ఉన్న వ్యవసాయ పంపుసెట్లు, చెట్లు, సుబాబుల్ తోటలు, ఇతర నిర్మాణాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేరుగా పరిహారం అందించినట్లు కలెక్టర్ తెలిపారు. సుబాబుల్ చెట్ల అంచనాలను అటవీశాఖ ద్వారా చేయించి పరిహారం చెల్లించామని, రైతుల విజ్ఞప్తి మేరకు అటవీశాఖ అధికారులతో మరోసారి పరిశీలన చేయించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌గా తన అధికార పరిధిలో ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట పరిహారం అందజేసినట్లు పేర్కొన్న ఆయన, భూ నిర్వాసిత రైతులు భూసేకరణ ప్రక్రియకు సహకరించాలని కోరారు. ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగకుండా సహకారం అందించడం ద్వారా ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎస్‌డీసీ ఎం. రాజేశ్వరి, ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు, ఇరిగేషన్ ఈఈ కె. బాబూరావు, డీఈ ఎస్. కిషోర్, సింగరేణి మండల తహసీల్దార్ ఆనంతుల రమేష్, నిర్వాసిత రైతులు తదితరులు పాల్గొన్నారు.


