కౌంటింగ్ భారీ ఏర్పాట్లు
2 గంటల వరకు పూర్తి ఫలితాలు
అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారి నాగేందర్
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ
సర్వేలను లెక్కచేయని పరిస్థితి
కాకతీయ, చేర్యాల: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భారీ ఏర్పాట్లు చేసినట్లు అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ నాగేందర్ తెలిపారు. గురువారం చేర్యాల మండల కేంద్రంలోని కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రం, పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగేందర్ మాట్లాడుతూ… ఎన్నికల సామగ్రి, సిబ్బందికి, కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఉదయం 8 గంటలకు..
శుక్రవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన అనంతరం 1వ వార్డు నుంచి 7వ వార్డు వరకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారి నాగేందర్ తెలిపారు. వెంట వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు.మొత్తం 7 టేబుల్స్, 2 రౌండ్లు, మొత్తం కౌంటింగ్ సిబ్బంది 36 మంది, పోలీస్ సిబ్బంది 120 మంది పాల్గొంటారని తెలిపారు. 12 వార్డుల ఫలితాలు మధ్యాహ్నం రెండు గంటల వరకు పూర్తి ఫలితాలు వెలుపడుతాయని తెలిపారు.
తీవ్ర ఉత్కంఠ
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఫలితాలు ఎలా వస్తాయోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఎవరి ఓట్లు ఎటువైపు మళ్లాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అభ్యర్థులకు అనుకూలంగా, ప్రతికూలంగా వచ్చినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు. ఓటర్ నాడిని సర్వేలు పసి గట్టలేక పోయారని అభ్యర్థులు చర్చించుకుంటున్నారు. దీంతో రేపు విలువడే ఫలితాలపై అభ్యర్థులు ఆశతో ఎదురు చూస్తున్నారు.


