రూ.4.76 కోట్ల గంజాయి కాల్చివేత
953 కిలోల మాదకద్రవ్యాల ధ్వంసం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్సైజ్ శాఖ చర్యలు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నమోదైన పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న భారీ గంజాయి నిల్వలను ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం ధ్వంసం చేశారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని ఆరు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో నమోదైన 47 కేసులకు సంబంధించిన 953 కిలోల గంజాయిని కాల్చివేయాలని ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని స్టేషన్లలోని గంజాయి నిల్వలను ఒకేచోట సమీకరించి, తల్లాడ మండలం గోపాల్‌పేటలోని ప్రభుత్వ అనుమతి పొందిన ఏడబ్ల్యూఎం కన్సంటింగ్ లిమిటెడ్ పరిశ్రమలో కాల్చివేశారు. ధ్వంసం చేసిన గంజాయి విలువ సుమారు రూ.4.76 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ఖమ్మం–1 స్టేషన్‌లో 42 కేజీలు, ఖమ్మం–2లో 57 కేజీలు, మధిరలో 193 కేజీలు, పాల్వంచలో 114 కేజీలు, మణుగూరులో 21 కేజీలు, భద్రాచలంలో 625 కేజీల గంజాయిని కాల్చివేసినట్లు డిప్యూటీ కమిషనర్ వివరించారు.


