- దందాను కొత్త పుంతలు తొక్కిస్తున్న స్మగ్లర్లు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : గంజాయిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు మాఫియా ముఠా ఎంతకైనా తెగిస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివిధ రకాల పద్ధతుల్లో గంజాయిని సరఫరా చేసేందుకు ముఠా విశ్వ ప్రయత్నాలు చేస్తూ కొందరు దొరికి కొందరు దొరకక పోవడం వల్ల గంజాయి దందా విస్తరిస్తుంది తప్ప పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడని పరిస్థితులు నెలకొన్నాయని పలువురు చర్చించుకోవడం విమర్శలకు తావిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం వేపలగడ్డ ప్రాంతంలో కంటైనర్ లారీలో సుమారు రెండు కోట్ల 50 లక్షల రూపాయల విలువచేసే రవాణా జరుగుతున్న గంజాయిని సోమవారం సుజాతనగర్ పోలీసులు పట్టుకున్న విషయం పాఠకులకు విధితమే.
ఇది జరిగి ఒక్కరోజు కూడా గడవకముందే పాల్వంచ ప్రాంతంలో గంజాయి ప్యాకెట్లు దొరకడం చర్చనీయంశంగా మారింది. కారు ఇంజన్లో గంజాయి ప్యాకెట్లు రవాణా జరుగుతున్న సమయంలో
ఇంజన్ వేడికి గంజాయి ప్యాకెట్లు దగ్దమయ్యాయి. మంటలను అదుపు చేయించేందుకు కారును మాఫియా ముఠా మంగళవారం పాల్వంచలోని ఒక సర్వీసింగ్ సెంటర్ కు తరలించి మంటలు అదుపు చేసే క్రమంలో ఇంజన్ డోర్ ఓపెన్ చేయగా కాలుతున్న గంజాయి ప్యాకెట్లు చూసి అక్కడున్న స్థానికులు కంగుతున్నారు. విషయాన్ని పోలీసులకు సమాచారం చేరవేయడంతో అప్రమత్తమైన గంజాయి స్మగ్లర్లు అక్కడే కారును వదిలి పరారయ్యారు. పోలీసులు గంజాయితో ఉన్న కారును పోలీస్ స్టేషన్కు తరలించారు. నిషేధిత గంజాయిని రవాణా చేస్తున్న పరారైన ముఠాలో ఒక మహిళ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. గంజాయి ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి సమాచారం కోసం ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా భద్రాద్రి జిల్లా కేంద్రంలోని భారీ గంజాయి పట్టు పడడం చూస్తే కలవరపెడుతున్న పరిస్థితి నెలకొంది.


