కష్టాల్లో ఉన్నవారికి ‘మనోజ్’ ధైర్యం
మృతుడి కుటుంబానికి చేయూత.. రోగులకు ఆర్థిక భరోసా
మానవత్వాన్ని చాటుకుంటున్న ‘మీ శ్రేయోభిలాషి బృందం’
కాకతీయ, ఖమ్మం : కష్టాల్లో ఉన్నామన్న పిలుపు విన్నా.. కన్నీరు పెట్టే దీనగాథ కనిపించినా.. ‘మేమున్నాం’ అంటూ ముందుకొచ్చి అండగా నిలుస్తోంది ‘మీ శ్రేయోభిలాషి బృందం’. బండి మనోజ్ కుమార్, గరిడేపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సేవా ప్రస్థానం పలువురి జీవితాల్లో ఆశ కిరణాలు నింపుతోంది. శనివారం ఖమ్మం నగరంలోని 60వ డివిజన్ రామన్నపేట, రామన్నపేట కాలనీ పరిసర ప్రాంతాల్లో పలువురు బాధితులకు ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. రామన్నపేట కాలనీకి చెందిన బానోతు శ్రీను గత గురువారం అకస్మాత్తుగా మృతిచెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. విషయం తెలుసుకున్న ‘మీ శ్రేయోభిలాషి బృందం’ శనివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించింది. ఈ సందర్భంగా బండి మనోజ్ కుమార్ తన వంతుగా రూ.5,000 ఆర్థిక సాయం అందించి కుటుంబానికి భరోసానిచ్చారు.
ఆస్పత్రిలో పరామర్శ.. వైద్యానికి తోడ్పాటు
ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరభద్రం కుమారుడు నవీన్‌ను మనోజ్ కుమార్, గరిడేపల్లి వెంకటేశ్వర్లు పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.5,000 నగదును అందజేశారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న రుంజా అశోక్‌ను పరామర్శించి రూ.5,000 సాయం తో పాటు దుప్పటిని అందించారు. చలికి వణుకుతున్న వృద్ధులను చూసి చలించిన మనోజ్ కుమార్ రామన్నపేట ప్రాంతంలోని వయోవృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా అనారోగ్యంతో సతమతమవుతున్న షేక్ హిమామ్ సాబ్‌కు నెలకు సరిపడా మందులు సమకూర్చడంతో పాటు రూ.2,000 నగదు సాయం అందించి మానవత్వానికి అర్థం చెప్పారు. కష్టంలో ఉన్నవారికి అండగా నిలవడమే లక్ష్యంగా సాగుతున్న ‘మీ శ్రేయోభిలాషి బృందం’ సేవలు స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.


