పీవోడబ్ల్యూ రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ విజయ్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : అక్టోబర్ 11, 12 తేదీల్లో నల్లగొండ జిల్లాకేంద్రంలోని శ్రామిక భవన్లో నిర్వహించే ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ విజయ్ పిలుపునిచ్చారు. కొత్తగూడెం రైటర్ బస్తీ ఐఎఫ్‌టీయూ కార్యాలయం నందు ముఖ్య కార్యకర్తల సమావేశం రాజేశ్వరి అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా అందే మంగ విజయ్ హాజరై మాట్లాడారు. గత 50 సంవత్సరాలుగా తమ సంఘం మహిళల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని, హక్కుల సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిందని అన్నారు. విద్యార్థి, యువజన సంఘాలతో ఐక్య కార్యాచరణ కమిటీ నిర్వహించి హైదరాబాదులో జరిగిన అందాల పోటీలకు వ్యతిరేకంగా పోరాడిందని పేర్కొన్నారు. బ్రాహ్మణ హిందూ భావజాలం పేరుతో మహిళలని వంటింటికే పరిమితం చేసే విధంగా ఈ పాలకవర్గాలు వ్యవహరిస్తున్నాయన్నారు. అందులో భాగంగానే సనాతన ధర్మం పేరుతో మహిళల్ని ఇంటికే పరిమితం చేయడం కోసం ఉద్యోగాల్లో రాణించకుండా, రిజర్వేషన్ల కోసం కొట్లాడకుండా, సాధించుకున్న హక్కులను పోగొట్టుకునే విధంగా పాలకులు వాళ్ల మెదల్లోకి పాశ్చాత్య సంస్కృతిని హిందూ భావజాలాన్ని ఎక్కిస్తున్నారని అన్నారు. మణిపూర్ రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల కోసం జరిగిన పోరాటంలో మహిళలను నగ్నంగా ఊరేగించి మహిళలను హింసించి దాడులు చేసి విధ్వంసం సృష్టించారని వారన్నారు. మరోపక్క ఏజెన్సీలో ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు మారణ హోమం సృష్టిస్తున్నారని సైన్యాలతో బెదిరిస్తున్నారని, ఎదురు తిరిగిన వారిని బూటక ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతున్నారని మండిపడ్డారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, అభివృద్ధి పేరుతో మహిళలని వ్యాపార వర్గాలు వాణిజ్య ప్రకటనల కోసం వారి అందచందాలను మార్కెట్లో వ్యాపారంగా మార్చుతున్నాయని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఈ క్రమంలోనే మహిళలను చైతన్యం చేయడం కోసం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 11, 12 తేదీల్లో నల్గొండ జిల్లాలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. మహిళలు, విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రాజకీయ శిక్షణ తరగతులను ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సుధారాణి ప్రారంభిస్తారని తెలిపారు. ప్రపంచీకరణ మహిళలు అనే అంశంపై పీవోడబ్ల్యూ
జాతీయ నాయకురాలు సంధ్య, పని విధానం ప్రణాళిక కార్యక్రమంపై ఝాన్సీ, సామాజిక పరిణామ క్రమంలో స్త్రీలు అనే అంశంపై రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, ఉద్యమాలలో స్త్రీలు అనే అంశంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ విజయ్ బోధిస్తారని తెలియజేశారు. సమావేశంలో నాగలక్ష్మి, సంధ్య, రాములమ్మ, కరుణ, రాధ, వెంకటమ్మ, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.


