- ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా మద్యం దుకాణాల కేటాయింపు
- పారదర్శకంగా మద్యం షాపుల ఖరారు
- జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : లాటరీ పద్దతి ద్వారా పారదర్శకంగా జిల్లాలో మద్యం షాపులు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం స్థానిక సీక్వెల్ రిసార్ట్స్ లో నిర్వహించిన మద్యం (ఏ4) షాపుల కేటాయింపు ప్రక్రియలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 116 ఏ4 మద్యం షాపుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు గౌడ కులస్థులకు 18, ఎస్సీలకు 14, ఎస్టీ లకు 8 రిజర్వ్ చేయగా, మిగతా 76 షాపులను ఓపెన్ టు ఆల్ గా కేటాయించి, అన్ని షాపులకు లాటరీ ద్వారా కేటాయింపులు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 116 ఏ4 మద్యం షాపులకు గాను 4430 దరఖాస్తులు వచ్చాయని, అధికంగా గెజిట్ సీరియల్ నెం. 27 నకు 75, అత్యల్పంగా గెజిట్ నెం.లు 73, 75 లకు 24 చొప్పున దరఖాస్తులు అందినట్లు తెలిపారు. దరఖాస్తుదారుల సమక్షంలో ప్రతి షాపుకు లక్కీ డ్రా తీస్తూ, పారదర్శకంగా లాటరీ పద్ధతిన మద్యం షాపుల కేటాయింపు ఖరారు చేశామన్నారు.
గతంతో పోల్చుకుంటే ఈసారి ఒక్కో అప్లికేషన్ కు లక్ష రూపాయలు అదనం కావడంతో తక్కువ అప్లికేషన్లు వచ్చినప్పటికీ 4430 అప్లికేషన్లకు గాను సుమారు రూ. 200 కోట్లు పైచిలుకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందన్నారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా మద్యం షాపుల కేటాయింపు మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. లక్కీ డ్రాలో అదృష్టం వరించి, మద్యం షాపులను దక్కించుకున్నవారు నిబంధనలను అనుసరిస్తూ, లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణీత రుసుము చెల్లించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి. జనార్ధన్ రెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి. నాగేంద్ర రెడ్డి, సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు వేణుగోపాల్ రెడ్డి, తిరుపతి, ఎక్సైజ్ సిఐ కృష్ణ, ఎక్సైజ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
వెనుదిరిగిన అభ్యర్థులు..
ఖమ్మం జిల్లాలో 116 మద్యం దుకాణాలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లక్కీ డ్రా కార్యక్రమంలో వివిధ షెడ్యూల్ కులాలకు కేటాయింపు జరిగిన దుకాణాలు పోగా మిగిలిన 76 దుకాణాలకు లక్కీ డ్రా తీయడం జరిగింది. 76 దుకాణాలకు గాను ఒక్కో దుకాణానికి 58 నుంచి 60 దరఖాస్తు దారులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్కో దుకాణం కి 58 నుంచి 60 మంది పోటీ పడగా దానిలో ఒక్కరు మాత్రమే లక్కీ డ్రా ద్వారా గెలుపొందడంతో మిగిలిన వారు నిరాశ నిస్పృహల మధ్య వెనుదిరిగారు. ఒక్క దుకాణాన్ని గెలుచుకునేందుకు సిండికేట్ గా ఏర్పడి కొందరు నాలుగు దరఖాస్తులు వివిధ పేర్లతో టెండర్ వేస్తే మరికొందరు 60 దరఖాస్తులను కూడా దాఖలు చేసి ఆ దుకాణాన్ని గెలుచుకున్న పరిస్థితి కూడా ఉంది.


