లుక్ యాప్ లూటీ..!
20వేలు ఇస్తే. రోజుకు 700 ఇస్తామంటూ బురిడీ
మహబూబాబాద్ జిల్లాలో ఘరాణా మోసం
ఒకరి ద్వారా మరొకరిని చేర్చేలా చైన్ మార్కెటింగ్
ముందు కొంత బ్యాంకు అకౌంట్లలో జమ చేసి ఆ తర్వాత ముఖం చాటేసిన ఆప్
మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో వందల సంఖ్యలో బాధితులు
పరువు పోతుందని బయటకు రాని బాధితులు
ఎవరిని అడగాలో తెలియక.. ఏం చేయాలో పాలుపోక మిన్నకుండిపోతున్న మరికొంతమంది
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : 20వేలు డిపాజిట్ చేస్తే.. రోజుకు 700 మీకు రిటర్న్ ఇస్తామంటూ లుక్ యాప్ అనే సంస్థ సైబర్ మోసానికి తెగపడింది. అత్యాశకు పోయిన అనేక మంది ఆర్థిక మోసానికి గురై.. ఇప్పుడు లబోదిబోమంటున్నారు. డబ్బులు పొగొట్టుకున్న విషయం బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని కొంతమంది, ఎవరికి కంప్లైట్ చేయాలో తెలియక, ఏం చేయాలో పాలుపోక మరికొంతమంది మిన్నకుండి పోతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లుక్ యాప్ బాధితులు వందల్లో ఉన్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ మండలాల్లోని వారిని లుక్ యాప్ నిర్వాహాకులు టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
మహబూబాబాద్ జిల్లాలో ఇదీ సంగతి..!
‘లుక్’ యాప్ పేరుతో వందలాది మందికి సైబర్ నేరగాళ్లు కుచ్చు టోపి పెట్టినట్లుగా బాధితుల ద్వారా తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంతో పాటు జగ్గుతండా, వెంకట్రాంపురం,శోక్ల తండా, బాలాజి పేట, ఉప్పలపాడు, లక్ష్మి నర్సిహపురం, గౌరారం, కొత్తపేట, ఇర్సులాపురంతో పాటు మండల వ్యాప్తంగా వందలాది మంది యువత,గృహిణులు బాధితులుగా మారినట్లుగా తెలుస్తోంది. లుక్ యాప్లో రూ.20 వేలు డిపాజిట్ చేస్తే తిరిగి రోజుకు రూ.700 చెల్లిస్తారని ఒకరి ద్వారా ఒకరు ప్రచారం చేసుకుంటూ..చేర్పించిన వారికి కమీషన్ వస్తుందని, చేరిన వారికి రోజువారీగా చెల్లింపులు ఉంటాయని యాప్ నిర్వాహాకులు ఎర వేయడంతో అంతా మోసపోయారు. చైన్ సిస్టమ్ తో సదరు యాప్ లో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టినట్టు సమాచారం. ఒకటి, రెండు వారాలు బాగానే చెల్లింపులు చేయడంతో చాలామంది రూపాయలు లక్షల్లో డిపాజిట్ చేశారనీ పబ్లిక్ టాక్. తీరా సాంకేతిక కారణాలు చూపి కొన్ని వారాలుగా చెల్లింపులు నిలిపివేయడంతో మోసపోయామని చెబుతుండటం గమనార్హం. యాప్ నిర్వాహాకులు ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే రూ. 3 కోట్ల వరకు వసూళ్లకు పాల్పడి ఉంటారన్న చర్చ జరుగుతోంది. ఈ విషయం ఎక్కడ బయటకు చెబితే తమ పరువుపోతుందోనని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు ముందకు రావడం లేదని సమాచారం.
యాప్ ఉచ్చులో..!
యాప్ నిర్వాహాకుల ఉచ్చులో ఏకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం చిక్కుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. లుక్ యాప్ పేరుతో యాప్ రూపొందించి వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం కల్పించారని సమాచారం. డబ్బు డిపాజిట్ చేస్తే ప్రతిరోజు ఆదాయం పొందవచ్చని నమ్మబలకడంతో చాలామంది ఆకర్షితులయ్యారని తెలుస్తోంది. ఈ యాప్లో స్కీమ్ రూపొందించి వారు కనిష్ఠంగా రూ. 20 వేల నుంచి మొదలై గరిష్ఠంగా లక్షల వరకు డిపాజిట్ చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.


