కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి
అన్ని విధాల అండగా ఉంటామని భరోసా
కాకతీయ, ఏపీ బ్యూరో : అనంతపురం జిల్లా రెండు రోజు పర్యటనలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. కళ్యాణదుర్గం పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద 71వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతిఒక్కరిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లిన తన సోదరి షేక్ జుబేదా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, సరైన తిండి లేక అనారోగ్యం పాలైన ఆమెను క్షేమంగా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని గుంతకల్లుకు చెందిన షేక్ షబానా మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తన ఇద్దరు కుమార్తెల ఉన్నత చదువుల కోసం ఆర్థికసాయం అందించాలని అనంతపురానికి చెందిన మదమంచి ప్రవీణ్ కుమార్ మంత్రి నారా లోకేష్ కలసి కోరారు. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా ఉప్పరపల్లిలో తాను ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కొనుగోలుచేశానని, అయితే రామకృష్ణారెడ్డి, కుమారస్వామిరెడ్డి అనే వ్యక్తులు దౌర్జన్యపూరితంగా తన స్థలాన్ని ఆక్రమించారని పుట్టపర్తి మండలం గువ్వలకుంటపల్లి గ్రామానికి చెందిన ఈ.సురేంద్ర రెడ్డి మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం మౌక్తికాపురంలోని గత 40 ఏళ్లుగా 110 ముస్లీం మైనార్టీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తమ గ్రామానికి చెందిన 4.86 ఎకరాల స్మశాన స్థలాన్ని ముద్దినాయనపల్లికి చెందిన ఈ.అశోక్ ఆక్రమించి తప్పుడు పత్రాలతో ఆన్ లైన్ లో నమోదు చేశారు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిబ్బంది మంత్రి లోకేష్ ను కలిసి కోరారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.


