ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోండి
ప్రతీ ఒక్కరూ నిర్ధిష్ఠ లక్ష్యం నిర్దేశించుకోవాలి
నాలుగు సార్లు సివిల్స్‌లో ఫెయిలయ్యా..!
ఐదోసారి సివిల్స్‌లో ఇండియా టాపర్‌గా నిలిచా
ఎన్‌సీసీ డే వేడుకలలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ స్ఫూర్తిదాయక ప్రసంగం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుని, ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా ప్రతి విద్యార్థి ఎదగాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఎన్.సి.సి. డే వేడుకలలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఎన్.సి.సి. డే వేడుకలలో పాల్గొని అద్భుతంగా నృత్య ప్రదర్శనలు చేసిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. 20 లక్షలకు పైగా యువత సభ్యత్వంతో ఎన్.సి.సి. సంస్థ పని చేస్తుందని, ఇందులో భాగస్వామ్యం కావడం విద్యార్థుల అదృష్టమని అన్నారు. క్రమశిక్షణ, దేశం గొప్పతనం, దేశానికి మనం ఎలా ఉపయోగపడాలి అనే భావన విద్యార్థులలో ఎన్.సి.సి. ప్రేరేపిస్తుందని, జీవితం ఉత్తమంగా గడిపేందుకు అవసరమైన జీవన నైపుణ్యాలు ఎన్.సి.సి. సంస్థ విద్యార్థులకు నేర్పిస్తుందని అన్నారు. విజయం కోసం మాత్రమే పని చేస్తే మంచి ఫలితాలు రావాలని, మనం చేసే ప్రతి పని అద్భుతంగా చేసినప్పుడు ఆటోమేటిక్ గా విజయవంతం అవుతామని అన్నారు. మనం చేసే ప్రతి పనిలో 100 శాతం మనం ఎఫర్ట్ పెట్టాలని అన్నారు. వైఫల్యాలు లేకుండా గొప్ప స్థానానికి ఎదిగిన వ్యక్తులు మనకు సమాజంలో ఎవరూ కనబడరని, వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలు సరి చేసుకుంటూ పని చేస్తే విజయం సాధిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకొని, దానిని సాధించే దిశగా కృషి చేయాలని అన్నారు. చిన్నతనం నుంచి ఒక మంచి ఐఏఎస్ కావాలని తన లక్ష్యాన్ని 5వ అటెంప్ట్ లో సాధించానని, నాలుగు సార్లు వైఫల్యం చెందిన నిరుత్సాహ పడకుండా చేసిన తప్పులను సరి చేసుకుంటూ లక్ష్యం వైపు ప్రయాణం కొనసాగించడం వల్లే ఆల్ ఇండియా టాపర్ వన్ గా సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించానని అన్నారు.
వైఫల్యంతో జీవితం ముగిసిపోదని, ప్రతి వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుంటూ మన నైపుణ్యాలను ఇంప్రూవ్ చేసుకుంటూ పనిచేస్తే మంచి విజయం సాధిస్తామని అన్నారు. మనం ఎంచుకున్న రంగంలో నిష్ణాతులుగా తయారు కావాలని , తల్లి దండ్రుల ఆశలను నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఇతరులకు ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.అంతకుముందు విద్యార్థులు చేసిన సామాజిక ప్రదర్శనలు అందరిని ఆలోచనలు తట్టిలేపాయి. దేశభక్తి గీతాలతో చేసిన పలు రకాల నృతాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఎన్.సి.సి. కమాండెంట్ నవీన్ యాదవ్, ఎస్.కె. భద్ర, పలు విద్యాసంస్థ నిర్వాహకులు రవిమారుతి, పార్వతీ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



