లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి
ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ నేతల డిమాండ్
కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన
కాకతీయ, కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటియుసి, ఐఎన్టియుసి, సిఐటియుల కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు పాల్గొని వ్యతిరేకించారు. అనంతరం ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ సెంట్రల్ కార్యదర్శి వంగ వెంకట్ మాట్లాడుతూ కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఒక దిక్కున కార్మిక హక్కుల కోసం పోరాటాలు చేసే ట్రేడ్ యూనియన్ లని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని కేంద్రంపై మండిపడ్డారు. సింగరేణి సంస్థను మెల్లగా కేంద్ర ప్రభుత్వం ప్రయివేటిరణ వైపు తీసుకెళ్తుందన్నారు. కార్మికులను 12గంటల పనిని చేయిస్తూ శ్రమ దోపిడి చేస్తున్న బడా పెట్టుబడిదారులను పెంచి పోషిస్తుందని మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఈ కార్మిక 44 చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మిక హక్కులను కాల రాస్తున్నాయని మండిపడ్డారు. ఈ కోడ్ ల విధానాన్ని రద్దు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్మిక సంఘాలు ఉండకూడదని కుట్రతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం లేబర్ చట్టాలను తెచ్చిందని కార్పొరేట్ శక్తులకు లాభం చేసే ఈ నాలుగు కోడ్ల అమలు వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. నాలుగు కోడ్లను వెంటనే రద్దు చేయకపోతే నిర్వదిక సమ్మెకు సైతం వెనుకాడబోమని యాజమాన్యాన్ని జాతీయ సంఘాలు హెచ్చరించాయి. కార్యక్రమంలో ఎఐటియుసి కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, సహాయ కార్యదర్శి సామల రాము, ఎర్రగాని కృష్ణయ్య, ఐ ఎన్ టీ యు సి నాయకులు త్యాగరాజన్, ఆల్బర్ట్, పీతాంబరం, సిఐటియు నాయకులు మంద నర్సింహారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


