- ఇద్దరు మంత్రుల మధ్య అగ్గిరాజేసిన మేడారం టెండర్లు..
- రూ. 71 కోట్ల పనులు తనకు తెలియకుండానే ఇచ్చారంటూ సురేఖ ఫైర్
- మంత్రి పొంగులేటిపై అధిష్ఠానికి కొండా దంపతుల ఫిర్యాదు
- వరంగల్ రాజకీయాలతోపాటు దేవాదాయ శాఖలో ఇన్‌చార్జి మంత్రి పెత్తనమేంటని ఆగ్రహం
- ఇటీవలే అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం
- వారం గడవక ముందే కేబినెట్ మినిస్టర్స్ మధ్య మరో లొల్లి ..
- హైకోర్టు తీర్పుతో ఇప్పటికే సర్కార్ ఉక్కిరిబిక్కిరి..
- తాజా వివాదంతో మరింత గందరగోళం
- ఓరుగల్లు కాంగ్రెస్‌లో కాకరేపుతున్న తాజా పరిణామాలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మంత్రుల మధ్య వార్ కొనసాగుతోంది. మొన్ననే మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం కాకరేపగా.. అధిష్టానం రంగంలోకిదిగి వారి మధ్య వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది. ఇది మరువక ముందే.. తాజాగా క్యాబినెట్ మినిస్టర్స్ మధ్య మరో లొల్లి మొదలైంది. మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, ఆ శాఖకు చెందిన మంత్రుల మధ్య విభేదాలు ముదిరి రచ్చకెక్కాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. పొంగులేటిపై సీఎం రేవంత్ రెడ్డికి, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వరంగల్ రాజకీయాలతోపాటు దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నట్లు కొండా దంపతులు అందులో పేర్కొన్నారు.
సురేఖ తీవ్ర ఆగ్రహం..
ఈ వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఫోన్ చేసిన కొండా మురళి ఆయనకు ఫిర్యాదు చేశారు. పొంగులేటి తన సొంత కంపెనీకి పనులు ఇప్పించుకుంటున్నారని తెలిపారు. ఆయన వల్ల జిల్లాలో తాము ఇబ్బంది పడుతున్నామని వెల్లడించారు. అదేవిధంగా జిల్లా రాజకీయాలను ఖర్గేకి వివరించారు. పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. హైకమాండ్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని కొండా దంపతులు పేర్కొన్నారు. కాగా, ఇటీవల మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. దేవాదాయ శాఖకు సంబంధించిన రూ. 71 కోట్ల పనుల టెండర్ తనకు తెలియకుండానే రావడంపై మంత్రి సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయమై సురేఖ.. ఏఐసీసీ ఛీఫ్ మల్లికార్జున ఖర్గేతోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
గతం నుంచే ఎడమొహం.. పెడమొహం
వరంగల్ ఇంచార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించిన నాటినుంచి ఆయన వ్యవహార శైలిపై జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి అనేక విషయాలతో పాటు ప్రొటోకాల్ అంశంపై పొంగులేటి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తనకు తెలియకుండానే, తనను సంప్రదించకుండానే కొన్ని కీలకమైన నిర్ణయాలను ఇంచార్జి మంత్రి హోదాలో పొంగులేటి తీసుకుంటున్నారని కొండా సురేఖ కొంతకాలంగా తవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే మేడారం పనుల టెండర్ల లొల్లి రచ్చకెక్కింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం.. ఓపక్క ప్రతిపక్ష పార్టీల చేతిలో, మరోపక్క హైకోర్టు తీర్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మంత్రుల రచ్చతో ఇక మల్లగుల్లాలు పడుతుంది. మంత్రుల వ్యవహారశైలిపై ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.


