కొమురవెల్లి ఏఈఓ బాసర కు బదిలీ
శాలువాతో సత్కరించిన ఈవో వెంకటేష్
బదిలీలు ఉద్యోగ జీవితంలో సహజం – కార్యనిర్వాహణాధికారి వ్యాఖ్య
కాకతీయ, కొమురవెల్లి : కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో సహాయ కార్యనిర్వాహణాధికారి (ఏఈఓ)గా విధులు నిర్వహిస్తున్న గంగ శ్రీనివాస్ బదిలీపై బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానానికి వెళ్లారు. ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వాహణాధికారి, డిప్యూటీ కమిషనర్ టంకాశాల వెంకటేష్ ఆయన్ని శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఈవో వెంకటేష్ మాట్లాడుతూ ఉద్యోగంలో బదిలీలు సర్వసాధారణమని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు గంగ శ్రీనివాస్‌ను ఆయన మాతృ సంస్థ అయిన బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానానికి బదిలీ చేయడం జరిగిందని తెలిపారు. అందుకు అనుగుణంగా కొమురవెల్లి దేవాలయ బాధ్యతల నుంచి ఆయన్ను అధికారికంగా రిలీవ్ చేసినట్లు వెల్లడించారు.
గంగ శ్రీనివాస్ 2019 సంవత్సరం నుంచి కొమురవెల్లి దేవాలయంలో ఏఈఓగా విధులు నిర్వహిస్తూ పరిపాలనా వ్యవహారాల్లో కీలక బాధ్యతలు చేపట్టారని ఈవో గుర్తు చేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో ఆయన సేవలు అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్, జూనియర్ అసిస్టెంట్లు శంకర్, మధుకర్, కంప్యూటర్ ఆపరేటర్లు శ్రీనివాస్, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. బాసరలోనూ ఆయన ఉత్తమ సేవలు అందించాలని ఆలయ సిబ్బంది ఆకాంక్షించారు.


