- జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
- 10 రోజుల ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ తో మార్పు స్పష్టంగా కనిపించాలి
- రోడ్లు, పార్కులు, సెంటర్లు పూర్తిగా శుభ్రం చేయాలి
- తెల్లవారుజామున నగరంలో పారిశుధ్య పనుల పరిశీలన
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరాన్ని మెరుగైన పారిశుధ్య సేవలతో ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం తెల్లవారుజామున జిల్లా కలెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి నగరంలో పర్యటించి, ప్రధాన రహదారులు, పార్కులు, మయూరి సెంటర్, వైరారోడ్, ప్రభుత్వ హాస్పిటల్, ఇల్లందు క్రాస్ రోడ్ సెంటర్లలో పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. చెత్త సేకరించే కార్మికులు, జవాన్లతో కలెక్డర్ ముచ్చటించారు. సైడ్ డ్రెయిన్లు శుభ్రపర్చాలని, రోడ్డు లో పేరుకుపోయిన మట్టి ఎత్తివేయాలని, డివైడర్స్ లోని మొక్కలను కాపాడాలని సూచించారు. బైపాస్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, శ్రీశ్రీ రోడ్లలో మరమత్ములు చేసిన గుంతల నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో పది రోజులపాటు ప్రత్యేక ప్రణాళికతో పారిశుధ్య డ్రైవ్ చేపట్టామన్నారు. చెత్తను శుభ్రం చేసి, మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ రోజువారీ పారిశుధ్య పనులకు దోహదంగా ఉంటుందన్నారు. నగరంలోని ప్రధాన, అంతర్గత రోడ్లలో ఎక్కడ చెత్త ఉండకుండా శుభ్రం చేయాలని, వర్షాల వల్ల పేరుకుపోయిన మట్టి తొలగించాలని అన్నారు. ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ క్రింద శానిటేషన్ నిర్వహించకుంటే చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్, ఈఈ కృష్ణలాల్, గ్రీనరీ అధికారి రాధిక, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్, జవాన్లు, అధికారులు పాల్గొన్నారు.


