రైతు జీవనధారగా కాళేశ్వరం
కేసీఆర్ దూరదృష్టితో పచ్చని తెలంగాణ
మండుటెండల్లోనూ గోదావరి జలాలతో సాగు విస్తరణ
కొండపోచమ్మ, మల్లన్న సాగర్లతో బీడు భూములు పంటచేలుగా మార్పు
హల్దీ వాగు జీవనదిగా మారి లక్షల ఎకరాలకు సాగునీరు
రైతు బంధు, బీమాతో రైతులకు ఆర్థిక భరోసా
గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి
కాకతీయ, గజ్వేల్ : తెలంగాణలో రైతుల జీవనాధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిందని, మండుటెండల్లోనూ గోదావరి జలాలను పొలాలకు అందించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటి విస్తరణతో తెలంగాణలో వ్యవసాయం కొత్త దిశగా పయనించిందని తెలిపారు.
కొండపోచమ్మ సాగర్ ద్వారా విడుదలైన నీరు హల్దీ వాగు, సంగారెడ్డి, రామాయంపేట కాల్వలతో పాటు అనేక ఉపకాల్వల ద్వారా 50కి పైగా గ్రామాల్లో చెక్‌డ్యామ్‌లు, చెరువులను నింపిందన్నారు. హల్దీ వాగు జీవనదిగా మారి ఒకప్పుడు బీడు భూములుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు పచ్చని పంటచేలుగా మారాయని వివరించారు. నిజాంసాగర్ వరకు నదికి ఇరువైపులా లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని తెలిపారు. జగదేపూర్, ఆలేరు, భువనగిరి, నల్గొండ ప్రాంతాలకు ఎండాకాలంలో కూడా కొండపోచమ్మ సాగర్ నుంచి సాగునీరు అందించడం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకత అని అన్నారు. ఒకప్పుడు నీటి కోసం ఎదురుచూసిన రైతులు ఇప్పుడు సంవత్సరం పొడవునా పంటలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. మల్లన్న సాగర్ కాల్వ ద్వారా కూడవెల్లి వాగులోకి నీరు చేరడంతో గజ్వేల్, దుబ్బాక ప్రాంతాలతో పాటు మానేరు, సిరిసిల్ల ప్రాంతాల్లో కూడా సాగు విస్తరించిందన్నారు.
కాళేశ్వరంతో భూగర్భ జలాల మట్టం పెరిగాయి
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభావంతో భూగర్భ జలాల మట్టం పెరిగి బావులు, బోర్లలో నీటి లభ్యత మెరుగుపడిందని, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి పథకాలతో రైతులు ఆర్థికంగా బలపడ్డారని చెప్పారు. వ్యవసాయానికి అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సాగునీటి ప్రాజెక్టులు చేపట్టడంలో విఫలమైందని, కాల్వల నిర్మాణంలో పురోగతి లేదని విమర్శించారు. రైతులకు సకాలంలో సాగునీరు, విద్యుత్, ఎరువులు అందడం లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు. రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించి, సాగునీటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


