కాకతీయ ఎఫెక్ట్… ఖమ్మంలో అక్రమ నిర్మాణాలపై కొరడా..!
కాకతీయ కథనానికి స్పందించిన బల్దియా కమిషనర్ అగస్త్య
ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, సెల్లార్లలో కార్యాలయాల ఏర్పాటుపై సీరియస్
వెంటనే యజమానులకు నోటీసులతో హెచ్చరిక జారీ
ఖమ్మంలో రెండు రోజులుగా కొనసాగుతున్న క్షేత్రస్థాయిలో తనిఖీలు
ఎప్పటికప్పుడు అక్రమ నిర్మాణాలు చేపట్టిన భవన యజమానులకు నోటీసులు

కాకతీయ,ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం పట్టణంలో గాడి తప్పిన టౌన్ ప్లానింగ్‌పై కార్పోరేషన్ అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలకు కదిలారు. ఈనెల 5న కాకతీయ దిన పత్రికలో ప్లానోటి.. కట్టెదొకటి అనే శీర్షికతో అక్రమ నిర్మాణాలు, సెల్లార్లలో కార్యాలయాల ఏర్పాటుపై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కాకతీయలో వచ్చిన కథనానికి ఖమ్మం మునిసిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య స్పందించారు. నిబంధనలు పాటించకుండా..సెల్లార్లలో కార్యాలయాలు, దుకాణాలు, స్టోర్ రూంలుగా వాడుకుంటున్న భవనాల యజమానులపై చర్యలు చేపట్టాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కమిషనర్ ఆదేశాల ప్రకారం.. అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారిని వసుంధర ఆధ్వర్యంలో సెల్లార్ల యజమానులకు నోటీసులు అందించారు. వెంటనే సెల్లార్లను ఖాళీ చేసి పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రెండు రోజులుగా స్పెషల్ డ్రైవ్..
కాకతీయలో కథనం ప్రచురితమైన తర్వాత మునిసిపల్ అధికారులు షాపింగ్ మాల్స్ సహా వ్యాపారాలకు వినియోగిస్తున్న బహుళ అంతస్తుల్లో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో అనేక భవనాల్లో సెల్లార్లలో కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు. ఈమేరకు గడువు లోపు కార్యాలయాలను తొలగించి.. పార్కింగ్‌లకు ఏర్పాటు చేసుకోవాలని, లేదంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొంటూ పలు భవనాల యజమానులకు టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేయడం గమనార్హం. సెల్లార్లలో దుకాణాలు ఏర్పాటు చేసి… ఫుట్ పాత్‌లపై వాహనాలను నిలిపివేస్తున్నట్లుగా ఖమ్మం నగరవాసుల నుంచి విమర్శలు వస్తున్నాయి. నగర సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న కాకతీయ దినపత్రికకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.


